బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం,పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం వారి అభిప్రాయాలను తీసుకున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్త అంటూ కుశల ప్రశ్నలు కూడా వేయటంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన మంచిని గణాంకాలతో సహ ముఖ్యమంత్రి వివరించారు. మరో 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలన్నారు సీఎం. నియోజకవర్గంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని... నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు వస్తుందన్నారాయన.
డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశాం... ఈ నియోజక వర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081కోట్లు ఇచ్చాం, 93,124 కుటుంబాలకు మేలు చేశామని జగన్ అన్నారు. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 47,123 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశామని ఇది చరిత్రలో జరగలేదన్నారు. ఈ స్థాయిలో ఇంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావు లేకుండా చేశామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా, ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఆయా కుటుంబాలకు మంచి చేశాం, బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశామన్నారు.
చేసిన మంచిని ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ వివరిస్తూ, వారికి లేఖలు ఇస్తూ గడపగడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, మంచి స్పందన కూడా వస్తుందన్నారు సీఎం. మన ప్రతినిధిగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తున్నా మీకు ధన్యవాదాలు అని జగన్ కొనియాడారు. ఎక్కడైనా పొరపాటున అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఉంటే అటువంటి వాళ్లకీ మళ్లీ మంచి చేయాలన్నదే ఈ గడపగడపకూ కార్యక్రమం ఉద్దేశంగా వివరించారు. అందరికీ మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నాం కాబట్టి మనకు అంతా మంచే జరుగుతుందని వివరించారు.
ప్రతి గ్రామ సచివాలయానికీ రూ.20లక్షలు ఇచ్చాం కాబట్టి, ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు ఈ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు జగన్. ప్రతి సచివాలయంలో కనీసం రెండు రోజులు గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటలపాటు ఆ సచివాలయంలో తిరగాలన్నారు. దీనివల్ల ప్రాధాన్యతగా చేపట్టాల్సిన పనులను గుర్తించగలుగుతామని, అన్నిరకాలుగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే, ఎన్నికలకు దాదాపుగా రెండేళ్లకు ముందే నాయకులను ఈ విధంగా తిప్పిన కార్యక్రమం గతంలో ఎన్నడూ లేదని జగన్ అభిప్రాయ పడ్డారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు ఎలాంటి సాధకబాధకాలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలన్నారు జగన్. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం మంచి విజయాలు సాధిస్తామని, ముఖ్యమంత్రిగా డీబీటీ ఇవ్వడం అయితేనేం, స్కూళ్లు బాగుచేయడం, ఆస్పత్రులు బాగుచేయడం అయితేనేం, వ్యవసాయం బాగుండేలా చూడటం.. ఇలా తాను చేయాల్సింది చేశాననని అదే సమయంలో మీరు చేయాల్సింది మీరు చేయాలన్నారు.