Nadendla about Infosys centre in Vizag:
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి అని, ఆయన పాలనతో రాష్ట్రానికి అపార నష్టమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలుయ్యాయని విమర్శించారు. గుంటూరులో సోమవారం మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడానికి సీఎం జగన్ ప్రధాన కారణం అన్నారు. సీఎం అమరావతి నుంచి కాకుండా విశాఖ నుంచి పాలనకు సిద్ధమైతే రాజధాని పేరుతో ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ నాలుగేళ్ల పాలనతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులు చితికిపోయారని, వారికి అండగా నిలిచేందుకు టీడీపీతో కలిసి జనసేన పోరాటం చేస్తుందన్నారు. వ్యవసాయరంగం అధ;పాతాళానికి పడిపోయిందని,
కృష్ణా పశ్చిమ డెల్టాకు రైతులకు సకాలంలో నీరివ్వక పోవడంతో 4 లక్షల ఎకరాల మేర పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పులిచింతల, పట్టిసీమ నీరును ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సీఎంకు నీటిపారుదల శాఖపై పట్టు లేదని విమర్శించారు.
కోడి గుడ్డు మంత్రికి, సీఎం ఇన్ఫోసిస్ తో సంబంధం ఏంటి?
నేడు విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అయితే ఇన్ఫోసిస్ ప్రోగ్రాంపై ప్రభుత్వం ఎందుకు హడావుడి చేస్తోంది.. కోడి గుడ్డు మంత్రికి, సీఎం జగన్ కు ఇన్ఫోసిస్ కార్యాలయంతో సంబంధం ఏంటని నాదెండ్ల ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారంలో 2 రోజులైనా ఆఫీసుకు వచ్చి పని చేసుకుంటారని దీన్ని నిర్మించారు. 250 నుంచి 300 మంది ఉద్యోగులు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారు. కానీ మీరేదే రాష్ట్రానికి ఇన్ఫోసిస్ తీసుకొచ్చారనేలా వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారంటూ నాదెండ్ల మండిపడ్డారు.