మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సచివాలయంలో ఘనంగా సాగింది. మొత్తం 25 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. అల్ఫాబేటిక్ ఆర్డర్ ప్రకారం ముందుగా అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరిగా విడదల రజనీ ప్రమాణం చేశారు.
కొందరు దేవుడిపై ప్రమాణం చేస్తున్నట్టు ప్రమాణ స్వీకారం చేశారు. అంజాద్ బాషా అల్లా పై ప్రమాణం చేశారు. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఉషా శ్రీ చరణ, ఆదిమూలపు సురేష్ ఇద్దరు ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.
బొత్స చాలా డిఫరెంట్
తెలుగులో ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ సౌరభౌమత్వం, అంతఃకరణ శుద్ధితో అనే పదాలు పలికేటప్పుడు తడబడ్డారు. ప్రమాణం తర్వాత గవర్నర్‌తో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత జగన్ వద్దకు వచ్చి థాంక్స్ చెప్పారు.
బూడి ముత్యాలనాయుడు తన కాళ్లుపై పడుతుంటే జగన్ వారించి అభినందించి పంపించారు. తర్వాత ఆయన గవర్నర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
గుడివాడ అమర్‌నాథ్ ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌కు సాష్టాంగ నమస్కారం చేశారు. జోగి రమేష్ కూడా కాళ్లపై పడేందుకు యత్నించారు. వద్దని జగన్ చెప్పి పంపించారు. వద్దని చెబుతున్న వినకుండా నారాయణ స్వామి సీఎం జగన్ కాళ్లకు నమస్కరించారు. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
తొలిసారి మంత్రిగా ప్రమాణం చేసిన ఉషా శ్రీచరణ్ కూడా ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు ఆర్కే రోజా. ప్రమాణ స్వీకారం తర్వా ఆమె జగన్ కాళ్లకు నమస్కరించి చేతిపై ముద్దుపెట్టారు.
రెండోసారి మంత్రిగా ప్రమాణం చేసిన సీదిరి అప్పల రాజు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ కాళ్లకు నమస్కరించారు. తానేటి వనిత కూడా సీఎం కాళ్లకు నమస్కరించారు. చివరకి ప్రమాణం చేసిన విడదల రజని కూడా జగన్ కాళ్లకు నమస్కరించారు.
ఈ ప్రమాణ స్వీకారణ కార్యక్రమానికి వైసీపీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.