Andhra Pradesh Mana Mitra WhatsApp: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మన మిత్ర పేరుతో వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా పొందవచ్చు. దీనికి మరిన్ని సేవలు యాడ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అధికారులతో మాట్లాడారు. కేంద్రంతో మాట్లాడి రైల్వే టికెట్లు ఇందులో బుక్ చేసునే సౌకర్యం కూడా కల్పిస్తామని అన్నారు. తిరుమల టికెట్స్‌ బుక్ చేసుకునే వెసులుబాటు కూడా తీసుకురాబోతున్నారు. 


ఈ వాట్సాప్ సేవలు పొందాలంటే ముందుగా 9552300009 నెంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నెంబర్‌కు వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ చేస్తే రిప్లై వస్తుంది. దాని ఆధారంగా మీకు కావాల్సిన సేవలు పొందవచ్చు. సేవ్‌ చేసుకోని వాళ్లు కూడా సేవలు పొంద వచ్చు. వాట్సాప్‌లో నెంబర్ సెర్చ్‌ దగ్గర మీ నెంబర్ టైప్ చేయండి. తర్వాత మీ నెంబర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు మీరే మెసేజ్ పంపించుకోవచ్చు. 


అలా మీకు మీరే నెంబర్ పంపించుకుంటే దానిపై క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. చాట్‌ విత్‌  9552300009 అని వాయిస్ కాల్ విత్‌ 9552300009 అని యాడ్‌ కాంటాక్ట్ అని కూడా వస్తుంది. మీరు మాత్రం చాట్ విత్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. నేరుగా నెంబర్ సేవ్ చేయకుండానే ఆ నెంబర్‌కు మెసేజ్ చేయవచ్చు. 


9552300009 నెంబర్‌కు మెసేజ్ చేస్తే రిప్లై వస్తుంది. సేవలను ఎంచుకోండి అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వాట్సాప్ ద్వారా లభించే సేవల విభాగానికి డైరెక్ట్ చేస్తుంది. అందులో చాలా విభాగాల సేవలు అక్కడ లభిస్తాయి. మీరు కరెంట్‌ బిల్‌ చెల్లించాలి కాబట్టి మీరు ఎనర్జీ సేవలను ఎంచుకోవాల్సి ఉంటుంది. 



ఎనర్జీ సేవలు ఎంచుకున్న తర్వాత సేవా నెంబర్‌ నమోదు చేయాలి. మీ కరెంట్‌ బిల్లులో ఉన్న సర్వీస్ నెంబర్‌ యాడ్ చేయాల్సి ఉంటుంది. 16 అంకెల నెంబర్‌ను టైప్ చేసిన తర్వాత కన్ఫామ్‌పై క్లిక్ చేయాలి. కన్ఫామ్‌పై క్లిక్ చేసిన తర్వాత ఏపీఈజీడీసీఎల్‌ సేవలు ఎంచుకోండని ఆప్షన్స్‌ ఇస్తుంది. బిల్లును వీక్షించడం అండ్‌ నిర్వహించడం, ఫిర్యాదులు వీక్షించడం అండ్‌ నిర్వహించండి, సేవలను వీక్షించండీ అండ్ నిర్వహించండి అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. 


మీరు కరెంట్ బిల్‌ చెల్లంచాలి కాబట్టి మొదటి ఆప్షన్‌ అయిన  బిల్లును వీక్షించడం అండ్‌ నిర్వహించండిపై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మీ వాట్సాప్ నుంచి విద్యుత్ శాఖకు మెసేజ్ వెళ్తుంది. అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది అందులో కొనసాగించండీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మరో మూడు ఆప్షన్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. 
చూడండి/ ప్రస్తుత బిల్లు చెల్లింపు
గత బిల్లులు చూడండి
ప్రస్తుత నెల కరెంటు బిల్లు చూడండి 


అనే ఆప్షన్స్‌లో మొదటిదానిపై క్లిక్ చేస్తే మీరు మొదట్లో టైప్ చేసిన సర్వీస్ నెంబర్ మళ్లీ కనిపిస్తుంది. మనుగడలో ఉంది అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఆ నెంబర్‌కు సంబంధించిన వివరాలు స్ర్కీన్‌పై కనిపిస్తాయి. మీ మీటర్ ఏ పరిధిలోకి వస్తుంది. సర్వీస్ నెంబర్ ఏంటీ, ఎవరి పేరు మీద ఉంది, మీటర్ కేటగిరి ఏంటీ, ఎన్ని యూనిట్లు వాడుకున్నారు, బిల్లు ఎంత, బిల్లు ఎప్పుడు తీశారు, ఎప్పటి లోపు బిల్లు చెల్లించాలో కూడా ఉంటుంది. 


Also Read: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?


వాటిని సరి చూసుకున్న తర్వాత పూర్తి అయింది అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. మీరు పంపిన రిక్వస్ట్‌ విద్యుత్ అధికారులకు వెళ్తుంది. వారి నుంచి తక్షణమే మెసేజ్ వస్తుంది. యూపీఐ ద్వారా బిల్లును చెల్లించండి అనే ఆప్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత మొత్తం బిల్లు ఎంత ఎలా చెల్లించాలనే వివరాలతో మరో మెసేజ్ వస్తుంది. 


అందులో రివ్యూ అండ్‌ పే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అనంతరం ఏ ప్లాట్ ఫామ్‌లో బిల్లు చెల్లించాలో అడుగుతుంది. అక్కడ మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా ఆప్షన్స్ అడుగుతుంది. మీకు ఎందులో అమౌంట్‌ ఉందో దాని ద్వారా బిల్లు చెల్లించవచ్చు. 


తర్వాత పేమెంట్‌ ప్రోసెస్‌లో ఉందనే మెసేజ్‌ మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ పేమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ చేస్తామని పంపిస్తుంది. అలా కాసేపటి తర్వాత పేమెంట్ విజయవంతమైంది అని చూపించడమే కాకుండా మీ కరెంట్‌ బిల్‌ను కూడా జీరోగా చూపిస్తుంది. 


Also Read: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?