గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. దుగ్గిరాల మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కో - ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నేడు జరగనుంది. ఎంపీపీ పదవిని తమ బుట్టలో వేసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ, టీడీపీ ఒకదాన్ని మించి మరొకటి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 9 మంది టీడీపీ, ఒక జనసేన, మరో 8 మంది వైసీపీ అభ్యర్థులు గెలిచారు. అత్యధిక సీట్లు టీడీపీకి రావడంతో దుగ్గిరాల ఎంపీపీ స్థానం టీడీపీకి దక్కే అవకాశమే ఉంది.


అయితే, అధికార వైఎస్ఆర్ సీపీ మాత్రం ఎంపీపీని దక్కించుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తోంది. 8 స్థానాలు వచ్చిన వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలను ఎమ్మెల్యే ఆర్కే క్యాంపునకు తరలించారు. అయితే, ఈ క్యాంప్‌ రాజకీయం తాజాగా వివాదానికి దారి తీసింది. దుగ్గిరాల-2 ఎంపీటీసీగా గెలిచిన తాడిబోయిన పద్మావతి క్యాంప్‌కు తీసుకెళ్లారు. దీనిపై ఆమె కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోయినా బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. పద్మావతి కుమారుడు యోగి.


కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ
దుగ్గిరాల మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కో - ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నేడు (మే 5) జరుగుతుందని ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి గత ఆదివారమే తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా తాడేపల్లి ఎంపీడీఓ రామ ప్రసన్న వ్యవహరిస్తారని ఆమె చెప్పారు. గతంలో కోరం లేక పోవడంతో మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక జరగలేదని చెప్పారు.


నేడు దుగ్గిరాల మండల పరిషత్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కో - ఆప్షన్‌ సభ్యుడి పదవికి నామినేషన్ల దాఖలు అవుతాయి. మధ్యాహ్నం 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఒంటిగంట తరువాత నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. అనంతరం కో - ఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక జరుగుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నికతో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఎంపీడీఓ మూడు రోజుల క్రితమే ప్రకటించారు.


కిడ్నాప్ ఆరోపణలు


వైఎస్ఆర్‌సీపీ తరపున  ఎంపీపీ ప‌ద‌విని  పద్మావ‌తి అనే ఎంపీటీసీ ఆశించారు. కానీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం వేరే ఎంపీటీసీని ఎంపిక చేశారు.  దీంతో రెబ‌ల్‌గా అయినా పోటీ చేసేందుకు ప‌ద్మావ‌తి సిద్ధ‌మ‌య్యార‌ు. టీడీపీ మద్దతు ఇస్తుందని వార్తలు రావడంతో  ప‌ద్మావ‌తిని ఎమ్మెల్యే ఆర్కే అనుచ‌రులు త‌మ వెంట తీసుకెళ్లార‌ు. ఈ విషయంపై పద్మావతి కుమారుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా తీసుకెళ్లారన్నారు.  త‌ల్లికి ఎంపీపీ ప‌ద‌విపై ఆశ లేద‌ని చెప్పిన యోగేంద‌ర్‌ నాథ్ ఆమె ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. త‌న త‌ల్లికి ఏదైనా జ‌రిగితే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు దుగ్గిరాల ఎస్సైలే బాధ్యత వ‌హించాల్సి ఉంటుంద‌ని యోగేంద‌ర్ నాథ్ హెచ్చ‌రించారు.


దుగ్గిరాల ఎంపీటీసీలుగా టీడీపీ తరపున గెలిచిన వారిలో జబీన్ అనే ఎంపీటీసీని ఎంపీపీగా నిలబెట్టాలని నిర్ణయించారు. అయితే ఆమెకు కుల ధృవీకరణ పత్రాన్ని అధికారులు జారీ చేయలేదు. రిజర్వేషన్ ప్రకారం బీసీ అభ్యర్థికి ఎంపీపీ సీటు కేటాయించారు. దుగ్గిరాల మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 9, వైఎస్ఆర్‌సీపీ  8, జనసేన 1 స్థానాలు గెలుపొందాయి. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. టీడీపీ ఎంపీపీ సీటు గెల్చుకునే అవకాశం ఉన్నా లోకేష్‌కు దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్‌సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టెన్షన్ ప్రారంభమయింది.