Guntur News: గుంటూరు జిల్లాలో పెళ్లికి ముందు వరుడు అరెస్టు కావడం చర్చనీయాంశం అయింది. పెళ్లి కోసం అంతా సిద్ధం చేసుకొని వచ్చిన వధువు తరపు వారికి అతను అరెస్టు అయ్యాడన్న విషయం తెలిసి కంగుతిన్నారు. దీంతో కాస్త గొడవలు కూడా చెలరేగాయి. వధువు తరపు వారి నుంచి ముందే కట్న కానుకలను అబ్బాయి కుటుంబ సభ్యులు తీసుకోవడంతో వాటిని తిరిగి ఇచ్చేయాలని అమ్మాయి తరపు వారు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగేలా చేశారు. వరుడు అరెస్టు కావడానికి గల కారణాలను పోలీసులు వివరించగా, అవి సినిమా కథను తలపించేలా ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో ఓ డిగ్రీ కాలేజీ రెండో అంతస్థు నుండి ఒక విద్యార్థిని దూకింది. వెంటనే ఆమెను స్థానికులు గుంటూరు జీజీహెచ్ కు తరలించగా.. యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువతి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం పాత రెడ్డి పాలేనికి చెందిన పవన్ కుమార్, అదే గ్రామానికి చెందిన కావ్య ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలో పవన్ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో కావ్యను వివాహం చేసుకొనేందుకు చేసుకోవటానికి నిరాకరించాడు. దీంతో కావ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈలోపు పవన్ కుమార్ పెద్దలు చూసిన యువతిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తుళ్ళూరు మండలం ఆలపాడుకు చెందిన మాధవితో పవన్ పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. కట్న కానుకల్లో భాగంగా వధువు కుటుంబం నుంచి ముందుగానే కట్నకానుకలు కూడా తీసుకున్నారు. ఈ రోజే వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. వధువు కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పెళ్ళి కూతురిని తీసుకొని కల్యాణ మండపానికి తీసుకొని వచ్చారు. వచ్చాక ఇంట్లో పెళ్ళి కొడుకు లేడని, అతను అరెస్టు అయ్యాడని తెలిసింది.
దీంతో తమను మోసం చేశారని తెలిసి వధువు బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని రెండు కుటుంబాలకు సర్ది చెప్పటంతో ముందుగా తీసుకున్న కట్న కానుకలు వరుడి తల్లిదండ్రులు తిరిగి ఇచ్చేశారు. దీంతో పెళ్లి కూతురుని తీసుకొని బంధువులు వెళ్ళిపోయారు.
పవన్ ముందుగా ప్రేమించిన కావ్య సరిగ్గా పవన్ మాధవిల పెళ్ళికి ఒక రోజుల ముందే ఆత్మహత్యాయత్నం చేసుకోవడం, పోలీసులు కేసు నమోదు చేసి పవన్ అరెస్ట్ చేయడంతో పెళ్లి రద్దయింది. ప్రేమించిన యువతిని మోసం చేశాడనే ఆరోపణలపై చివరికి పవన్ జైలుపాలు కావాల్సి వచ్చింది.