ముందుగా ప్రకటించిన విధంగా నేటి నుంచి ఉద్యోగులు ఉద్యమ కార్యచరణ చేపట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఊహించని స్పందన రావడంతో డైలమాలో పడ్డారు జేఏసీ నేతలు. ఇవాళ అత్యవసరంగా ఈసీ సమావేశం నిర్వహిస్తున్నారు ఏపీ జేఏసీ అమరావతి నేతలు.
ఉద్యోగుల ఆర్థికపరమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఇవాళ్టి నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది ఏపీ జేఏసీ అమరావతి. ఇప్పటికే జిల్లాలవారీగా ఉద్యమం కొరకు ఉద్యోగులను సన్నద్ధం చేశారు జేఏసీ నేతలు. అయితే మొన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రభుత్వం చాలా అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఈ నెలాఖరుకల్లా సుమారు 3 వేల కోట్ల బకాయిలు చెల్లించేందుకు సబ్ కమిటీ ఒప్పుకుంది. అయితే కమిటీ నుంచి రాతపూర్వకంగా హామీ ఇవ్వాలనేది అమరావతి ఉద్యోగుల జేఏసీ డిమాండ్. లిఖితపూర్వకంగా హామీ వచ్చే వరకూ ఉద్యమం తప్పదని ప్రకటించారు జేఏసీ నేతలు.
కీలకంగా సీఎస్ నిర్ణయం..
నిన్న(బుధవారం) సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు జేఏసీ నేతలు. సబ్ కమిటీ హామీలపై రాతపూర్వకంగా స్పష్టత ఇవ్వాలని సీఎస్‌ను కోరినట్లు జేఏసీ చైర్మన్ బొప్పరాజు చెప్పారు. దీనికి సీఎస్ అంగీకరించినట్లు చెప్పారు. అయితే ఉద్యమంపై చర్చించేందుకు ఇవాళ(గురువారం) అత్యవసరంగా ఈసీ సమావేశం ఏర్పాటు చేసింది ఏపీ జేఏసీ అమరావతి. కాసేపట్లో జరిగే సమావేశంలో ఉద్యమం కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్ బొప్పరాజు చెప్పారు.
ముందుగా జేఏసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలి. అయితే ఈసీ సమావేశం తర్వాత ఉద్యమంపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు ఒక్క ఏపీజేఏసీ అమరావతి తప్ప మిగిలిన సంఘాలు ఉద్యమానికి దూరంగా ఉండటంతో ఎంతమంది ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటారనేది కూడా అనుమానంగానే ఉంది.
ఉద్యమం పై క్లారిటి....
నేటి నుంచి ఆందోళన కార్యక్రమాల నిర్వాహణపై అమరావతి జేఎసి ముందస్తుగా ప్రకటన చేసింది. అయితే ఇదే సమయంలో మంత్రివర్గం ఉపసంఘం సమావేశం నిర్వహించటం, ముఖ్య కార్యదర్శితో పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన తరువాత నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఇంకా క్లారిటి రావాల్సి ఉంది. ఈసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించటం, ఇప్పటికే ఉద్యోగుల్లో ఉన్న అసహనం ఉన్న వేళ సమస్యల పై గట్టిగా పట్టుబట్టేందుకు, ఉన్న దారులన్నింటిని వెతికేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఉద్యోగులతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికి అవి ఆశించిన స్థాయిలో జరగలేదన్నది ఉద్యోగుల అభిప్రాయంగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఆర్దిక ఇబ్బందులకు సంబందించిన అంశాలను పూర్తి వివరాలతో ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకుల ముందు ఉంచింది. అంతే కాదు కరోనా తరువాత నుంచి రాష్ట్ర పరిస్దితులు ఇబ్బందికరంగా మారటంతో పాటుగా, ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆర్దిక అంశాలు ,ఇబ్బందులు ఇలానే కొనసాగుతాయని కూడా ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల ఉద్యోగుల ముందు ఖరాఖండీగా స్పష్టం చేశారు. దీంతో ఇక ఆర్దిక పరమయిన అంశాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న అభిప్రాయంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యచరణ, ఎలా ఉండాలి, ఇప్పటికే ప్రకటించిన ఉద్యమం ఏ దిశగా తీసుకువెళ్ళాలన్న దాని పై నేడు క్లారిటి వచ్చే అవకాశం ఉంది.