Amaravati News: అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు సెంటు స్థలాన్ని ఇవ్వాలని గతంలో సీఎంగా వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకు అనుగుణంగా పట్టాలను సిద్ధం చేశారు. సుమారు 50,000 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సెంటు చొప్పున స్థలం ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సెంటు స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకారాన్ని అందించాలని అప్పట్లో నిర్ణయించింది.


ఈ స్థలాలను పంపిణీ చేసేందుకు అనుగుణంగా కృష్ణయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటి నిర్మాణం, స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థూపాన్ని ఎవరో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. శిలాఫలకాన్ని కూడా తొలగించారు.  ఇది ఎప్పుడు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ తరహా చర్యలు వల్ల టిడిపి నాయకులు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటూ వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 


అప్పట్లో వ్యతిరేకించిన అమరావతి పరిరక్షణ సమితి..


రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం పట్ల అప్పట్లోనే అమరావతి పరిరక్షణ సమితి తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టులకు వెళ్లిన అమరావతి పరిరక్షణ సమితి నాయకులు దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించారు. అయితే, అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానాల్లో నిర్ణయం రావడంతో విపక్ష నేతలు ఎదురు దాడికి దిగారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మురుకువాడలు నిర్మిస్తారా..? అంటూ టిడిపి అప్పట్లో ప్రశ్నించింది అమరావతిని నాశనం చేసేందుకు ప్రభుత్వం ఇలాంటి ఎత్తులు వేస్తోందని ఆరోపణలు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. తాజాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టిడిపి నేతృతంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు, దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్తులను టిడిపి శ్రేణులు ధ్వంసం చేస్తున్నారు.


ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ శిలాఫలకాలు, ఫోటోలను ధ్వంసం చేస్తున్నారు. ఈ కోవలోనే రాజధాని ప్రాంతంలో సెంటు స్థలాల పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసిన నమూనా ఇంటితోపాటు, స్థూపాన్ని ధ్వంసం చేసినట్లు వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలే తప్ప.. ఆ పార్టీ నాయకులు ఆవేశపూరితంగా ఈ తరహా చర్యలకు పాల్పడడం దారుణం అంటూ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచి వైసీపీ చెబుతున్నట్టుగానే రాజధానిలో నిరుపేదలకు అవకాశం లేకుండా చేస్తున్నారన్న విమర్శలను ఆ పార్టీ నాయకులు నిజం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.