కోడి కత్తి కేసుకు అలిపిరి బాంబు పేలుడు ఘటనకు లింకు పెట్టటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నేతలకే చెల్లిందని, తెలుగు దేశం పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మండిపడ్డారు. తమ కుట్రలను ఎదుటి వారికి అంటగట్టి తప్పించుకోవటంలో జగన్ రెడ్డి ముఠా ఆరితేరిందని ఆయన వ్యాఖ్యానించారు.
కోడి కత్తి కేసుపై తెలుగు దేశం హాట్ కామెంట్స్
కోడి కత్తి ఘటనను, అలిపిరి బాంబు పేలుడు ఘటనతో ముడిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన నేతలు కామెంట్స్ చేయటం పై తెలుగు దేశం పార్టి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, బొండా ఉమామహేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. కోడికత్తి కేసును అలిపిరి బాంబు బ్లాస్ట్‌తో ముడిపెట్టడం జగన్ రెడ్డి కుట్రల నుండి ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ కాదా అని ఆయన ప్రశ్నించారు. కోడికత్తి శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్ రెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీ వేసిన విషయం నిజం కాదా అని బోండా ప్రశ్నించారు. అతను జగన్ రెడ్డి వీరాభిమాని అని స్వహస్తాలతో రాసిన 11 పేజీల లేఖ రుజువు చేసిందన్నారు. కోడికత్తి శ్రీనివాసరావుకు ఏ రకంగా కూడా తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదని ఎన్ఐఏ తన కౌంటర్ పిటిషన్ పేరా నెం.6లో స్పష్టం చేసిందని తెలిపారు.
వ్యవస్థల్ని మేనేజ్ చేయగల అధికారం, రూ.2 లక్షల కోట్ల అవినీతి డబ్బు జగన్ రెడ్డి దగ్గర ఉంది తప్ప తెలుగు దేశం వద్ద లేదన్నారు. తన అవినీతి కేసులో నాలుగున్నర సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు హాజరవ్వడం లేదంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసే శక్తి ఎవరికి ఉందో దీన్ని బట్టి అర్ధమవుతోందని బోండా అన్నారు. ముఖ్యమంత్రిగా జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు లభించని మినహాయింపు జగన్ రెడ్డి ఎలా పొందారో చెప్పాలన్నారు.
అలిపిరి ఘటనలో గంగిరెడ్డి...
తన అవలక్షణాలను, అడ్డదారుల్ని ఎదుటి వారికి అంటగట్టి తన దొంగ బుద్ధుల్ని కప్పిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ పై బోండా మండిపడ్డారు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నేరస్తులకు జగన్ రెడ్డి అనుచరుడు, ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి సెల్‌ఫోన్లు సరఫరా చేసినట్లు రుజువైందని చెప్పారు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్, పరిటాల రవి హంతకులతో జగన్ రెడ్డి చేతులు కలిపినట్లు ఆరోపణలున్నాయని, కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం కేసుల్లో కడప జైల్లో ఉండగా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019 ఆగస్టులో బెయిల్ ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. 26 ఎర్రచందనం కేసులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులు ఉన్న వ్యక్తికి జగన్ రెడ్డి ప్రభుత్వ లాయర్ల సహకారం లేకుండా బెయిల్ ఎలా సాధ్యమైందో పేర్ని నాని సమాధానం చెప్పాలని బోండా డిమాండ్ చేశారు.
కొల్లం గంగిరెడ్డి కుటుంబం వైసీపీలో కొనసాగుతోందన్న విషయం వాస్తవం కాదా అన్నారు. కోడికత్తి శ్రీను గానీ, అతని కుటుంబం గానీ టీడీపీలో లేదన్నారు. అలిపిరి బాంబు బ్లాస్ట్ కేసును కోడికత్తి కేసుతో ముడిపెట్టడం బోడిగుండుకు మోకాలికి ముడివేసే ప్రయత్నమని మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికార దాహానికి దళిత యువకుడి భవిష్యత్ నాశనమైందని. కోడికత్తి, వివేకానందరెడ్డి గొడ్డలి వేటు అధికార క్రీడలో పావులు అయ్యాయన్నారు.