Minister Roja On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ కు చదువులేకపోవడం వలన రుషికొండపై ప్రభుత్వ ఉత్తర్వులను విమర్శిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. రుషికొండను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. జగన్ చేసే కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి, చంద్రబాబును కాపాడటానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. జగనన్నే మా నమ్మకం కార్యక్రమం ద్వారా టార్గెట్ 175 కొడతామనే నమ్మకం కలుగుతుందని మంత్రి రోజా అన్నారు. జగనన్నే మా నమ్మకం బ్యాడ్జ్ ,సెల్ ఫోన్ స్టిక్కర్ వేసుకోవటం గర్వంగా ఉందంటున్నారు.
ప్యాకేజీ తీసుకుని సపోర్ట్
విశాఖ రుషికొండపై నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి రోజా అన్నారు. అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేపట్టామన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తవ్వకాలు ఉన్నాయని నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇచ్చిందని తెలిపారు. పవన్ కల్యాణ్ కు అవగాహన అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రుషి కొండపై ఏడు బ్లాకులకు అనుమతి ఉంటే మేము నాలుగు బ్లాకుల్లోనే పనులు చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన బ్లాకుల్లో కూడా పనులు చేపడతామని స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీలో లోకేశ్ తోడల్లుడి భూములు ఉన్నాయని, అందుకే పవన్ ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబుపై ఫైర్
వైసీపీ స్టిక్కర్ల ప్రచారంపై ఇటీవల పవన్ విమర్శలు చేశారు. రుషికొండ తవ్వకాలు కనిపించకుండా 151 అడుగుల స్టిక్కర్లు అతికిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు వత్తాసుపలుకుతున్నారన్నారు. గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు ఇటీవల కంచె వేశారని తెలిపారు. ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్ చూసి టీడీపీ అధినేత చంద్రబాబుకు భయపట్టుకుందని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ, జనసేన చాటుమాటుగా వాళ్లు స్టిక్కర్లు వేస్తున్నారని మండిపడ్డారు. పది ఇళ్లకు స్టిక్కర్లు వేసుకున్నంత మాత్రాన ప్రజామద్దతు ఉండదన్నారు. చంద్రబాబు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకుని సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో పై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. చంద్రబాబు రాజకీయం అంతా వెన్నుపోటులతో నడిచిందన్నారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని మంత్రి రోజా అన్నారు.
ఇదే నా సవాల్
"మా నగరిలో లేదా మీ కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా? ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకుంటావా చంద్రబాబూ? రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేది. కానీ జగన్ పాలనలో చేసి చూపించారు. మెగా సర్వే చేయటానికి దమ్ము ఉండాలి. సీఎం జగన్‌కు దమ్ముంది. తన పాలనపై నమ్మకం ఉంది. అందుకే ఏడు లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజలంతా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాలంటీర్లంతా జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగలేదని జనం చెప్తున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు చేసి పెడుతున్నారని చెప్తున్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ"- మంత్రి రోజా