భారత్‌లో చాలా మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు ఈరోజు  మధ్యాహ్నం ఒక ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. ముఖ్యంగా ఆండ్రాయిండ్‌ ఫోన్లకు సుమారు మధ్యాహ్నం 12.19 ప్రాంతంలో ఈ మెసేజ్‌ వచ్చింది. పెద్ద బీప్‌ సౌండ్‌, ఫ్లాష్ తో వినియోగదారులకు సందేశం వచ్చింది. దీంతో చాలా మంది ఈ మెసేజ్‌ ఏంటో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. ఏదైనా సైబర్‌ నేరగాళ్ల పని అయ్యిండొచ్చేమో అని కంగారు పడుతుండొచ్చు కూడా. అయితే అలా కంగారు పడాల్సిందేమీ లేదట. భారత ప్రభుత్వమే ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ మెసేజ్‌ను దేశంలో పలు స్మార్ట్‌ఫోన్లకు పంపించింది. ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షించడంలో భాగంగా శాంపుల్‌ మెసేజ్‌స్‌ను ప్రజలకు పంపించినట్లు తెలుస్తోంది.


డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ నుంచి ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్ట్‌ చేసేందుకు శాంపుల్‌ మెసేజ్‌ వచ్చింది. తమకు ఎమర్జెన్సీ అలర్ట్‌ అంటూ మెసేజ్‌ వచ్చిందని, మరెవరికైనా ఇలా వచ్చిందా అంటూ పలువురు సోషల్‌మీడియాలో తమ ఫోన్లకు వచ్చిన సందేశం ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ విషయంపై సోషల్‌మీడియా వేదికగా నెటిజన్ల చర్చకు దారి తీసింది.


అయితే భూకంపాలు, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, సునామీలు, ఇతర విపత్తులేమైనా వచ్చినప్పుడు ప్రజలను తక్షణమే అలర్ట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. దీన్ని పరీక్షించడం కోసమే దేశవ్యాప్తంగా కొంతమందికి మెసేజ్‌ పంపించారు. ఇలాంటి టెస్ట్‌లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ నుంచి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. వేర్వేరు సమయాల్లో వేర్వేరు రీజియన్స్‌లో  ట్రయల్స్‌ చేస్తూ ఉంటుంది. ఇలాంటి అత్యవసర హెచ్చరికలు పంపించడంలో మొబైల్‌ ఆపరేటర్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, ఇతర సమస్యలను అంచనా వేయడానికి ఇలాంటి టెస్ట్‌లు చేస్తుంటారు.


ఈ మెసేజ్‌లోనే దానికి సంబంధించిన వివరాలను కూడా ఇచ్చారు. భారత ప్రభుత్వానికి చెందిన టెలికమ్యూనికేషణ్‌ విభాగంలోని సెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ పంపించిన నమూనా టెస్టింగ్‌ మెసేజ్‌ ఇది. దీనిని పట్టించుకోవద్దని సందేశంలో తెలిపారు. మీ నుంచి ఎలాంటి స్పందన అవసరం లేదని స్పష్టంచేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్‌-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షించేందుకే ఈ మెసేజ్‌ను పంపించామని తెలిపారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుందని మెసేజ్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్‌ మెసేజ్‌లు జులై 20, ఆగస్టు 17 తేదీల్లో కూడా వచ్చాయి.