Andhra Pradesh : డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు. స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైన వేళ పవన్ మాట్లాడారు. రిషికొండను గుండు కొట్టినట్టు ప్రత్యర్థులను విమర్శలతో గుండు కొట్టే సత్తా అయ్యన్నకు ఉంది. ఇకపై ప్రత్యర్థులను విమర్శించే అవకాశం ఆయనకు ఉండదు. కానీ అలా విమర్శలు చేసే వారిని వారించే బాధ్యత ఆయనకు ఉంది. 


సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్‌. ఓటమిని ధైర్యంగా స్వీకరించే దమ్ము వైసీపీకి లేదన్నారు. అందుకే సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇన్ని దశాబ్దాల్లో ప్రజల అయ్యన్న పాత్రుడిలో వాడీవేడి చూశారు ఇన్నాళ్లూ ఘాటైన వాగ్దాటి చూశారని అన్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని అయ్యన్నను ఉద్దేశించి కామెంట్ చేశారు. 


గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని పవన్ తెలిపారు. భాష మనసులను కలపడానికి ఉండాలే తప్ప విడగొట్టడానికి కాదని అభిప్రాయపడ్డారు. భాష విద్వేషం రేపడానికి కాదని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించడానికి అని అన్నారు. ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు. 


గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని అన్నారు పవన్. ఇకపై సభలో వేసే ప్రతి అడుగు భవిష్యత్తు తరతరాలకు ఆదర్శంగా నిలవాలని అందుకే స్పీకర్ కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.