Tadepalli: నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఈ వేకువ జామున పోలీసుల పహారా మధ్య పడగొట్టేశారు. 






సీతానగరం వద్ద ఉన్న వైసీపీ కార్యలయాన్ని ఐదు గంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డిఏ అధికారులు కూల్చేశారు. ఇది ఫస్ట్‌ ఫ్లోర్‌ శ్లాబ్ వేయడానికి సిద్ధమవుతున్న టైంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. 




నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. బోట్ యార్డుగా ఉపయోగించే స్థలాన్ని తాను అధికారంలో ఉన్నప్పడు పార్టీకి తక్కువ లీజుతో కట్టబెట్టారని అది చట్టవిరుద్దమనే ఇప్పుడు చర్యలు తీసుకున్నామని అధికార టీడీపీ చెబుతోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు కూడా పేర్కొంటున్నారు. 


కూల్చే టైంలో అటుగా కార్యకర్తలు వేరే నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. సీఆర్డీఏ అధికారులు కూల్చే టైంలోనే వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తొందరపాటు చర్యలు వద్దని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంతలోనే అధికారులు పని పూర్తి చేశారు. దీనిైప వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు ఇంటికి సమీపంలో ఉందన్న కారణంతోనే కూల్చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. 


ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందో చంద్రబాబు శాంపిల్‌గా చూపించారని అన్నారు మాజీ సీఎం జగన్. దేశంలోని ప్రజాస్వామ్యులంతా ఈ ఘోరాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. "ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను." అని జగన్ ట్వీట్ చేశారు. 






వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా దురుద్దేశ పూర్వకంగా కూల్చివేయడం రాష్ట్ర చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోతుందంటున్నారు మాజీ మంత్రి సీదరి అప్పలరాజు. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థని లెక్కచేయకుండా చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పతనానికి ఇదే నాందని శాపనార్థాలు పెట్టారు.