స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. కూటమి నేతలంతా ఆయన్ని స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఈయన మూడో స్పీకర్. 2014-19 వరకు స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌ వ్యవహరించారు. తర్వాత 2019-2024 వరకు స్పీకర్‌గా తమ్మినేని సీతారాం బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు చింతకాలయ అయ్యన్న పాత్రులు ఆ బాధ్యతలు తీసుకున్నారు.  


1983 నుంచి టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అయ్యన్నపాత్రుడు ఎన్నో బాధ్యతలు చేపట్టి తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాదు పార్టీ గౌరవాన్ని కూడా కాపాడారు. 42 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు స్పీకర్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు.


అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి 1983-1989, 1994-1996, 2004-2009, 2014-2019 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ తరపున నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 1984-1986లో ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా పని చేశారు. 1994-96లో ఆర్‌ అండ్‌బీ మినిస్టర్‌గా ఉన్నారు. 1996లో ఎంపీగా కూడా అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అయ్యన్నకు అటవీశాఖ బాధ్యతలు అప్పగించారు. అయ్యన్నపాత్రుడు 1989, 2009, 2019వో మాత్రమే ఓటమి పాలయ్యారు. 


అయ్యన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు విజయ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి కచ్చితంగా ఆయనతో పోటీ చేయించాలని ప్రయత్నించి విఫలమయ్యారు.  


ప్రత్యర్థులపై విరుచుకపడటంతో అయ్యన్న స్టైలే వేరు. సామాన్యులను, మాస్ యూత్‌ను ఆకర్షిస్తూ ప్రత్యర్థులపై విమర్శుల ఫిరంగులు వదులుతుంటారు. ఇది పార్టీ అధినాయకత్వానికి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఆయన స్వభావం అంతేలే అన్నట్టు ఊరుకుటుంది. మొన్నటికి మొన్న అంటే ఎన్నికల ఫలితాలు తర్వాత కలిసిన సన్నిహితులతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్‌ను చూపిస్తూనే వైసీపీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ దూరంగా ఉంటోంది.