ఏపీ రాజకీయల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పాత మిత్రులు అంతా ఏకం అవుతున్నారు. విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో జనసే, మంత్రుల మధ్య రేగిన వివాదం అప్పట్లోనే కొత్త మలుపు తీసుకుంది. నేరుగా చంద్రబాబు పవన్‌ వద్దకు వెళ్లిన కలవడం పది రోజుల క్రితం సంచలనంగా మారింది. వీరిద్దరి కలయిక ఏపీ రాజకీయాల్లోనే హాట్‌ టాపిక్‌ అయింది. ఈ కలయికపై అధికార పార్టీ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసింది.  


వైజాగ్‌ ఇన్సిడెంట్‌ చంద్రబాబు, పవన్ కలయికకు స్కోప్ ఇస్తే... ఇప్పటం పంచాయితీ మరో సరికొత్త కలయికకు వేదిక అయింది. రహదారి విస్తరణ పేరుతో వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఇప్పటంలో పవన్ పర్యటించారు. అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలోనే పవన్‌తో సీపీఎం నేత మధు భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఇప్పటం గ్రామంలో బాధితులకు  అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


ఏపీలో ఎన్నికల పెరుగుతున్న ఎన్నికల హీట్


ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఊహించని విధంగా మారిపోతోంది. అధికార పార్టీని టార్గెట్ చేసుకొని ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. కలసి పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఏ పార్టీ ఎవరితో కలసి నడుస్తుంది అనే సందేహాలు ఇంకా నడుస్తున్నాయి. తాజాగా జనసేన ఏపీ రాజకీయాల్లో దూకుడును పెంచింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు జనసేన కేంద్రంగా నడుస్తున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు.  


విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత జనసేనపై అధికార పక్షం కూడా కౌంటర్ అటాక్‌ గట్టిగానే మొదలు పెట్టింది. మంత్రులపై దాడులు చేస్తే ప్రతిపక్షాలు అన్ని జనసేనకు మద్దతుగా నిలవటంపై వైసీపీ నేతలు, మంత్రులు మండిపడ్డారు. ఇదే సమయంలో ఎన్నికల పొత్తుల వ్యవహరం కూడా తెరపైకి వచ్చింది రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో కలసి పోటీ చేయటం అప్పటి పరిస్థితులను బట్టి కామన్‌గా జరిగే పరిణామం. అయితే ఎన్నికలకు ఇంకా 18నెలల సమయం ఉంది. ముందే ఆ హీట్‌ వచ్చిందా అన్నట్టు పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. 


అధికారంలో ఉన్న వైసీపీ ఎలాగూ సింగల్‌గా పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. ఈసారి ఏకంగా 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్‌గా పెట్టుకుంది. జనసేన కూడా ఎన్నికలకు ప్రిపేర్ అయ్యే క్రమంలో కలసి వచ్చిన పార్టీలను కలుపుకోవాలని భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలబోనివ్వనని చెప్పిన పవన్ ఆ దిశగానే పావులు కదుపుతున్నారు. విశాఖ ఘటనతో టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి పవన్ కలవటం జరిగిపోయింది. 


బీజేపీని వదిలి వస్తే పని చేసేందుకు సిద్దమని వామపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీపీఐ టీడీపీకి దగ్గరగా నడుస్తుంది. సీపీఎం కూడ కలసేందుకు చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటం వేదికగా సీపీఎం కీలక నేత మధు కూడా జనసేన అధినేత పవన్‌ను కలిశారు. ఇరువురు నేతలు కూడా బాధితులకు మద్దతు తెలిపారు. దీంతో దాదాపుగా కూటమి రెడీ అయ్యిందనే ప్రచారం ఊపందుకుంది.


మరి బీజేపి సంగతి ఏంటీ?


టీడీపీ, జనసే, వామపక్షాలు కూటమిగా ఏర్పాటు అయ్యేందుకు సిద్ధం అవుతున్న వేళ బీజేపి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు సరికొత్త చర్చ. ఇప్పటికే జనసేనతో పొత్తు ఉందని బీజేపి నేతలు పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. రోడ్ మ్యాప్ ఇవ్వమని పవన్ బీజేపి అగ్రనేతలను అడిగారు కూడా. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే వైసీపీని ఎదుర్కోనేందుకు పవన్, టీడీపీ, వామక్షాల ఒక్కటవుతున్నాయని టాక్ నడుస్తోంది. ఈ కూటమి ఏర్పాటుకు బీజేపినే అవకాశం ఇచ్చిందని అపవాదు ఉంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇలాంటి కామెంట్స్ చేశారు. పవన్‌ను సరిగా వాడుకోలేదని ఆరోపించారు. వాస్తవంలో కూడా ఆదే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు బీజేపి వ్యూహం ఏంటన్నది ప్రస్తుతానికి చర్చనీయాశంగా మారింది.