బీజేపి, వైసీపీ మిలాఖత్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరికి పెళ్లి మాత్రమే కాలేదని ఘాటుగా స్పందించారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలసుని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపి అధ్యక్షుడు సొము వీర్రాజు కలిసిన తరువాత పొత్తుల వ్యవహరం తెర మీదకు వచ్చింది. ఈ వ్యవహారంపై రామకృష్ణ ఘాటుగా స్పందించారు. 


రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పోరాటానికి కలిసి రావాలని పవన్, చంద్రబాబు పిలుపు నిచ్చారని, అయితే జగన్‌కు ప్రజాస్వామ్యం పట్టదని.. రాజ్యాంగం పై అవగాహన లేదని రామకృష్ణ కామెంట్ చేశారు. నాకు అధికారం ఉంది..‌నా ఇష్టం వచ్చిన విధంగా అన్నీ జరగాలని భావిస్తున్నారని, దేశంలో అపరిపక్వత ఉన్న ఏకైక సిఎం జగన్ అని మండిపడ్డారు. ప్రతిపక్షాల నుంచి అర్జీలు తీసుకోకుండా, కనీసం ప్రజాసమస్యలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇంత మూర్ఖత్వంతో పాలన‌ చేయడానికి వంద శాతం బీజేపీ సహకారం‌ ఉందని ఆరోపించారు. మోడీ, షా సపోర్ట్ లేకపోతే జగన్ నెల రోజులు కూడా ఆ కుర్చీలో ఉండలేరని, అన్ని కేసులు ఉన్నా...‌అవినీతి రుజువైనా జగన్ మీద చర్యలు ఉండవని పేర్కొన్నారు. 


వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐ విచారణను జగన్ అడ్డుకున్నారని, కోర్టులో పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం అంటే జగన్ చేతకాని తనం‌ వల్లే కదా అని ప్రశ్నించారు రామకృష్ణ. విజయసాయి రెడ్డి విశాఖను దోచుకుంటున్నారని, ఢిల్లీలో విసా రెడ్డికి ఉన్న పవర్‌ ఎవరికి లేదని తెలిపారు. ఆయనకు ఇచ్చిన పదవులు కూడా ఎవరికీ ఇవ్వలేదని, ఇవన్నీ బీజేపీ సహకారం లేకుండా ఎవరిస్తారని ప్రశ్నించారు.


స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విసా రెడ్డిని చేసింది‌‌ బీజేపీ కాదా అని ప్రశ్నించారు రామకృష్ణ. వైసీపీ, బీజేపీ పెళ్లి చేసుకోలేదు కానీ, కలిసి కాపురం‌ చేస్తున్నారని, వారి సహకారంతోనే జగన్, విజయసాయి రెడ్డి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ‌ చంద్రబాబుకు తెలియవా... ఏ2కు సపోర్ట్ ఉన్న బిజెపికి దూరంగా ఉండలేరా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు బీజేపీ కుట్రలు అర్ధం అయ్యాయని, రూట్ మ్యాప్ విషయంలో వాళ్లు మోసం చేసినట్లు తెలుసుకున్నారని అన్నారు. ఇప్పుడు అయినా పవన్ కల్యాణ్ బీజేపీతో తెగ తెంపులు చేసుకోవాలని, సీనియర్ అయిన చంద్రబాబుకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించారు. 


ఏపీ రాష్ట్ర ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసి పని‌ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు రామకృష్ణ. బీజేపీ‌ని వదిలేసి‌ వస్తే తాము కలిసి పని చేసేందుకు సిద్దమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతోపాటు దేశ ప్రయోజనాలపై చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సిపిఐ మద్దతు ఇస్తుందని... ఏపీలో విభజన బిల్లు అంశాలపై రాహుల్ గాంధీ స్పష్టమైన ‌ప్రకటనలు చేశారని తెలిపారు.


సీపీఎం కూడా అదే దారిలో...


బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం వారికి సహకరిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏపీకి‌ బీజేపీ అన్యాయం చేసినా...‌వైసీపీ, టీడీపీ, జనసేన వారితోనే తయతక్కలాడుతున్నాయని మండిపడ్డారు. ఊడిగం చేయను అన్న పవన్... ఆ పార్టీతో తెగ తెంపులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ, టీడీపీ నేతలు మోడీ మోసాలను ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలతో కొట్టుకుంటున్నారని, గతంలో పాచిపోయిన లడ్డూ అన్న పవన్ బీజేపీతో దోస్తీ ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఆత్మాభిమానం ఉంటే జనసేన, బీజేపీ నుంచి‌ బయటకి రావాలని, వైసీపీ, బీజేపీ ప్రభుత్వం విధానాలపై పవన్ పోరాడాలన్నారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ వల్లే పెద్ద ప్రమాదం ఏర్పడిందని, బీజేపీని‌ వదలకుండా ప్రజాస్వామ్య ఉద్యమం సాధ్యం కాదని అన్నారు. అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలను తొక్కుకుంటూ బీజేపీ ఎదుగుతుందని, చంద్రబాబు కూడా పోరాటాల పేరుతో బీజేపీతో ఉంటూ టీడీపీని బలి చేస్తారా అని ప్రశ్నించారు.