Coromandel Train Accident : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 238 మంది మృతి చెందితే... అందులో తెలుగువాళ్లే వంద మందికిపైగా ఉన్నారని సమాచారం అందుతోంది.
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుంచి కోరమాండల్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ వెళ్తుండగా బహంగా బజార్ స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ముందు బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. వాటిని షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. 238 మంది ఈ దుర్ఘటనలో మృతి చెందారు. వీరిలో తెలుగు వారు ఎక్కువ మంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రమాదంలో వందమందికిపైగానే తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో తెలుగు ప్రయాణికులు గాయపడి చికిత్స పొందుతున్నారు. వాళ్లను కటక్, బాలాసూర్, భువనేశ్వర్‌లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ఓ బృందాన్ని ప్రమాద ఘటన ప్రాంతానికి పంపించారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలోని బృందం ఒడిశాకు బయల్దేరి వెళ్లింది. ఈ బృందంలో ముగ్గురు ఐఏఎస్‌లు ఉన్నారు. అమర్ వెంట సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ ఉన్నారు.
ఒడిశాలోని ప్రమాదంలో గాయపడని వారి కోసం, బాధితుల కోసం దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. విజయవాడ, రాజమండ్రిసహా పలు రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక సెల్‌ను చేశారు అధికారులు.
విజయవాడకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
Rly -67055
BSNL- 0866 2576924
రాజమండ్రికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
BSNL: 08832420541
RLY: 65395
సికింద్రాబాద్: 040 - 27788516
విజయవాడ : 0866-2576924
రాజమండ్రి : 0883-2420541
సామర్లకోట: 7780741268
ఏలూరు: 08812-232267
తాడేపల్లిగూడెం: 08818-226212
బాపట్ల: 08643-222178
తెనాలి: 08644-227
విశాఖలో కూడా ప్రత్యేక సెల్ పని చేస్తుందని చెప్పారు విశాఖ రైల్వే సూపరిటెండెంట్ శ్రావణ్ కుమార్. ఏబీపీ దేశంలో మాట్లాడిన ఆయన విశాఖ రైల్వే స్టేషన్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసామన్నారు. రద్దైన, దారి మళ్లించిన రైల్ వివరాలు ఎప్పటికప్పుడు ప్రయాణికులకు వివిధ మార్గాల్లో అందిస్తున్నామని వివరించారు. ప్రమాదఘటన, సహాయక చర్యలు, సమాచారం ఉన్నతాధికారులు నుంచి అందిన వెంటనే ప్రయాణికులకు అందిస్తున్నామని తెలిపారు. అవకాశం ఉన్న రైళ్లు దారి మళ్లించి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్టు పేర్కొన్నారు.