YS Jagan launches YSRCP Digital Book | చిలకలూరిపేట: తెలుగుదేశం పార్టీ తమ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులను ఎదుర్కొనేందుకు రెడ్ బుక్ తీసుకొచ్చింది. అందులో అన్నీ రాసుకుని వడ్డీతో సహా బాకీ తీర్చేస్తామని మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల సమయంలో పలుమార్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల వైసీపీ డిజిటల్ బుక్ యాప్ తీసుకొచ్చింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులను ఇందులో నమోదు చేయాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల వైసీపీ డిజిటల్ బుక్ యాప్ (YSRCP Digital Book APP) లాంచ్ చేయడం తెలిసిందే.
వైసీపీ డిజిటల్ బుక్‌లో విడదల రజనీపై ఫిర్యాదుఏపీ మాజీ మంత్రి విడదల రజనీకి వైసీపీ డిజిటల్ బుక్‌లో షాక్ తగిలింది. చిలకలూరిపేటలోని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం నాడు వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ద్వారా విడదల రజినిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ, ‘2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ ఆఫీసుతో పాటు, నా ఇల్లు, కారుపై మాజీ మంత్రి విడదల రజినీ దాడి చేయించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశానని’ వివరించారు.
డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు అనంతరం వచ్చిన టికెట్‌ను చూపించారు. తనకు కనుక జగన్ న్యాయం చేస్తే.. వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఈ డిజిటల్ బుక్ యాప్ ద్వారా న్యాయం అందుతుందని నమ్మకం కలుగుతుందన్నారు రావు సుబ్రహ్మణ్యం. ఇందులో ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని అందరికీ దీనిపై నమ్మకం కలుగుతుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.
వాస్తవానికి మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేటలోని తన ఇంటి వద్ద, వైసీపీ నాయకులు, శ్రేణులతో కలిసి వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌ను ఆవిష్కరించడం తెలిసిందే. ఇప్పుడు ఆమె మీద నియోజకవర్గం నుంచి ఫిర్యాదు రావడంతో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి. దీనిపై వైసీపీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.
వైసీపీ కార్యకర్తలకు జగన్ భరోసా, అభయం
ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ….. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదుర్కొంటున్న అన్యాయం, వేధింపులు, కక్షలు, తప్పుడు కేసులు వీటికి ఒక సమాధానం, సాక్ష్యం కావాలి అని పార్టీ అధినేత వైఎస్ జగన్ YSRCP డిజిటల్ బుక్ ప్రారంభించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలకు సమాధానం ఈ డిజిటల్ బుక్ ద్వారా దొరుకుతుందన్నారు. ఈ డిజిటల్ బుక్ వైసీపీ కార్యకర్తలకి జగనన్న ఇస్తున్న భరోసా, అభయం అని పేర్కొన్నారు.