ఏపీలో ముందస్తు ఎన్నికల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాకులో ఏపీ కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికలకు అంతా సిద్ధం కావాలంటూ మంత్రులకు సీఎం జగన్ చెప్పారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతుందని కొంత మంది మంత్రులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. దీనికి సీఎం బదులిస్తూ.. ముందస్తు ప్రచారాలను పట్టించుకోవద్దని అన్నారు. ఎన్నికలకు సిద్దం అవ్వాలని కోరారు. 


జగనన్న సురక్ష కార్యక్రమం బాగా జరిగిందని సీఎం కొనియాడారు. ఇంకా బాగా కొనసాగించాలని మంత్రులకు సీఎం సూచించారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మరింత మెరుగ్గా సాగాలని నిర్దేశించారు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని మార్గనిర్దేశనం చేశారు. ఎన్నికల సమయం కాబట్టి నిత్యం ప్రజల్లోనే అందరూ ఉండాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.


మూడు గంటలకు పైగా కేబినెట్ భేటీ


ఏపీ సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లో బుధవారం (జూలై 12) ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు మూడున్నర గంటలు సమావేశం నడిచింది. మొత్తం 55 అంశాలపై ఈ భేటీ సాగినట్లు సమాచారం. అలాగే.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇంకా రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులకు రాష్ట కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అలాగే, అసైన్డ్ ల్యాండ్‌ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్‌ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.