ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి  జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు కావాలని ఆయన నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ పై క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది  అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్‌ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని సీఎంకు అధికారులు తెలిపారు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు జరిగేలా బదిలీలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. యూనిట్‌ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి.. వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.


ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు..
ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్‌ ద్వారా నడిచే విధంగా చర్యలు ఉండాలని చెప్పారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలాల్లో రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటు చేసి వాటిని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. వచ్చే జూన్‌ నాటికి ఈ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలని, నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. ఇందుకు అవసరం అయిన మేరకు సిబ్బందిని కూడా  నియమించాలని ఆదేశాలు ఇచ్చారు.


జగనన్న విద్యా కానుక...
వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యంత్రి జగన్ స్పష్టం చేశారు. విద్యాకానుక నాణ్యత విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నాణ్యత పాటించేలా క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు జరిపించాలని, ఇప్పటికే 93 శాతం విద్యాకానుక వస్తువులను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. విద్యా సంవత్సరానికి అవసరం అయిన పుస్తకాలన్నింటినీ రెడీ చేయాలని, రెండో సెమిస్టర్‌ పుస్తకాలు అన్నీకూడా ముందుగానే ఇచ్చేందుకు సిద్ధం కావాలని జగన్ అన్నారు.


ప్యానల్స్ పై శిక్షణ కార్యక్రమాలు


మొదటి దశ నాడు–నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో ఆరో తరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటు కు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ప్యానెల్స్‌ వినియోగంపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్న తీరును గురించి జగన్ అధికారులను అడిగి   తెలుసుకున్నారు. ప్యానెల్స్‌ను ఎలా వినియోగించాలన్న దాని పై వీడియో కంటెంట్‌ టీచర్లకు పంపించాలని సీఎం సూచించారు.కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరి ద్వారా టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20వేల మంది బీటెక్‌ స్టూడెంట్స్‌ ఇంటర్న్‌షిప్‌ చేస్తారని సీఎంకు అధికారులు వివరించారు. వీరంతా ప్రతినెలా వెళ్లి.. టీచర్లకు ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ వినియోగంలో సహాయకారిగా ఉంటారని వెల్లడించారు.


అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం


జూన్‌ 12 నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న వేళ ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండర్ ను సీఎం జగన్ సమీక్షించారు.


2023లో టెన్త్, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. జగనన్న ఆణిముత్యాలు పేరుతో విద్యార్ధులకు ఇవ్వనున్న మెడల్స్‌ ను సీఎం జగన్ పరిశీలిచారు. స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2023 ద్వారా మూడు దశలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను సత్కారించనుంది. నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను జూన్‌ 15న, జిల్లా స్ధాయిలో జూన్‌ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్‌ 20న అవార్డులు సర్కార్ అందజేయనుంది.