ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కోసం నిధులను విడుదల చేశారు. రజకులు, నాయీబ్రాహ్మణు, దర్జీల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. వరుసగా రెండో ఏడాది ఈ ‘జగనన్న చేదోడు’ పథకం కింద నగదు విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ సంక్షేమ పథకం కింద 2,85,350 మంది బ్యాంకు అకౌంట్లలో రూ.285.35 కోట్లను జమ చేస్తున్నామని వెల్లడించారు. తాజాగా విడుదల చేస్తున్న రూ.285.35 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఈ పథకం కింద అందించిన మొత్తం సాయం రూ.583.78 కోట్లకు చేరింది.


‘‘ఏపీలో టైలరింగ్ షాపులు నిర్వహిస్తున్న 1,46,103 మంది దర్జీలకు రూ. 146.10 కోట్లు అందుతున్నాయి. ఇస్త్రీ, లాండ్రీ షాపులున్న 98,439 మంది రజకులకు 98.44 కోట్లు అందిస్తున్నాం. దుకాణాలు ఉన్న 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 40.81 కోట్ల సాయం అందిస్తున్నాం. లంచాలు, వివక్షతకు వీల్లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేస్తున్నాం. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద సాయం అందజేస్తున్నాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం నీరుగార్చిందని చెప్పారు.


వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక 1.84 లక్షల పర్మినెంటు ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులిచ్చామని అన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను 73 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని తెలిపారు. 58 శాతం నామినేటెడ్‌ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని సీఎం అన్నారు. 51 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని సీఎం జగన్‌ తెలిపారు. 


మరోవైపు, ఉద్యోగుల సమ్మె గురించి కూడా సీఎం జగన్ స్పందించారు. ఉద్యోగులు సీఎంను తిడుతుంటే చంద్రబాబు అనుకూల మీడియా పండగ చేసుకుంటోందని విమర్శించారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి సంధి జరిగి.. వారు సమ్మెకు వెళ్లకపోవడంతో వారికి మంట కలుగుతోందని అన్నారు.