ఏపీలో ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతంలోనే అత్యధికంగా క్రైమ్ రేటు ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆ ప్రాంతంలోనే గ్యాంగ్‌ రేప్‌లు, హత్యలు జరిగాయని.. వాటిపై మహిళా కమిషన్‌ ఏమీ మాట్లాడదని విమర్శించారు. మహిళల భద్రతకు తమ పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. జనసేన తరఫున ప్రజాకోర్టు కార్యక్రమం చేపట్టబోతున్నామని పవన్‌ చెప్పారు. మంగళగిరిలో జనసేన వీర మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడం చాలా పెద్ద విషయమని పవన్‌ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. మంగళగిరిలో జనసేన వీర మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాణంలో 15 మంది మహిళలు కూడా పాలుపంచుకున్నారని చెప్పారు. 


‘‘ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించదు. కేవలం సీఎం ఫొటోలు కనిపిస్తే సరిపోతుందా? మనకోసం బలిదానం చేసిన వారిని గౌరవించుకోవాలి. సగటు మహిళకు సాంత్వన చేకూర్చలేని అధికారం ఎందుకు? రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను కూడా సీఎం పాటించడం లేదు. మహిళలకు రాజ్యాధికారంలో మూడో వంతు భాగం ఉంది. మహిళల అదృశ్యంపై సమీక్షకు సీఎంకి తీరిక లేదు. జగన్ పాలన చూసి భయపడి పారిపోవద్దు.. పోరాడదాం. ప్రజాధనాన్ని అత్యంత పారదర్శకంగా ఖర్చు చేస్తాం. కొత్త పథకాలకు జాతి నాయకుల పేర్లు పెడతాం. అక్రమాలపై సమాచారం ఇచ్చే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం ఉంటుంది. వైఎస్ఆర్ సీపీ నాయకుల అన్యాయాలపై జనసేన ప్రజాకోర్టు నిర్వహిస్తాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.