నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద నేడు రాజధాని అమరావతిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే 50 వేలకుపైగా ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసి 50,793 మందికి ఇళ్లు మంజూరు చేశారు. మే 26న పట్టాలు పంపిణీ ప్రారంభించారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 


ఒక్కో ప్లాట్‌ ధర 10 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ ఇళ్లు నిర్మాణం అయ్యే ప్రాంతాల్లో 384.42 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించబోతున్నట్టు చెబుతోంది. ఇందులో విద్య, ఆరోగ్య కోసం 73.74 కోట్లు ఖర్చు చేస్తామంటోంది. 


ఇక్కడ ఇల్లు నిర్మాణానికి 1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. పావలా వడ్డీకి మరో 35 వేలు చొప్పున బ్యాంకు రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఫ్రీ ఇసుక ఇస్తున్నారు. సబ్సిడీపై సిమెంట్, స్టీల్, మెటల్‌ ఫ్రేమ్స్‌తోపాటు ఇతర సామాగ్రిని ఇస్తున్నారు. 


రాజధాని ప్రాంతానికి హెలికాప్టర్ లో సీఎం..
అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ళ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో బయలుదేరి శంకుస్దాపన, కార్యక్రమానికి హజరు కానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి స్పెషల్ హెలికాప్టర్ లో రాజధాని ప్రాంతానికి రావటం చర్చనీయాశంగా మారింది. తాడేపల్లిలోని నివాసం నుంచి రాజధాని ప్రాంతానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరానికి సీఎం హెలికాప్టర్ వినియోగించటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో భారీ కార్యక్రమం జరుగుతుందని, ఒకేసారి 47 వేళ్ళ ఇళ్ళ నిర్మాణానికి భారీగా లబ్దిదారులు వస్తుండటంతో వారికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయిని అధికారులు అంటున్నారు. అటు వీవీఐసీ సెక్యూరిటిలో సీఎంకు రహదారిని క్లియర్ చేయటం ఇబ్బందిగా మారే పరిస్దితి ఉండటంతో హెలికాఫ్టర్ ద్వార రాకపోకలకు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు.


జులై 24న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణం వ్యవహరంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహరం పై ఇప్పటికే రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి మరి ప్రభుత్వం పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ళను కేటాయించింది. ఇప్పటికే లే-అవుట్‌లను రెడీ చేసి, అర్హులైన వారందరికి పట్టాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఇళ్ళ నిర్మాణానికి జగనన్న కాలనీల పేరుతో శంకుస్దాపన పర్వానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అవుతున్నారు. నవరత్నాలు, పేదలందరికి ఇళ్ళు పథకం కింద ఇళ్ళ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా శంఖుస్థాపన చేయనున్నారు.


పేదలకు ఇళ్ళ నిర్మాణం చేసి తీరుతాం... సజ్జల
సోమవారం R5 జోన్ లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాజధాని ప్రాంతంలో  అమరావతిలో పేదల సొంతింటికల సాకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనే సాధ్యమవుతుందని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని సౌకర్యాలతో పేదలకు  ప్రైవేటు లే అవుట్ తరహాలో రాజీపడకుండా ఇళ్ళు నిర్మిస్తున్నామని తెలిపారు.  ఇళ్ళ నిర్మాణంతో పేదలకు 10 వేల కోట్ల సంపద ఏర్పడబోతోందని అన్నారు.  ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం ఒప్పుకోకపోయినా మొత్తం భారం భరించడానికి సిధ్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో సేకరించిన భూమిలో 5 శాతం ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలోనే ఉందన్నారు.  పేదలు అమరావతిలో ఉండకూడదని, కేవలం సంపన్న వర్గాలే ఉండాలన్నది, గత చంద్రబాబు ప్రభుత్వ ఆలోచన అని విమర్శించారు.