ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్‌ యంత్ర సేవ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ కోత యంత్రాలను పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం 10.40 గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో డాక్టర్‌ వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లను, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం సరదాగా కాసేపు ట్రాక్టర్ నడిపారు. మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలక్రిష్ణ కూడా పాల్గొన్నారు. 


రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీ చేశారు. మొత్తం 5,262 రైతు గ్రూపు బ్యాంక్‌ ఖాతాలకు రూ.175.61 కోట్ల రాయితీ సొమ్మును సీఎం జగన్ బటన్‌ నొక్కి జమ చేశారు.


ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నామని గుర్తు చేశారు. ప్రతీ గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీ దశలో రైతుకు తోడుగా ప్రభుత్వం ఉంటోందని, అందుకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ట్రాక్టర్లతో సహా వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచామని వివరించారు. రూ.2016 కోట్లతో ప్రతి ఆర్‌బీకే స్థాయిలో 10,750 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు. 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు.


పథకం కింద లబ్ధి పొందాలంటే ఇలా..
ఈ పథకం కింద ట్రాక్టర్ పొందాలనుకొనే రైతులు ఈ పద్ధతిని అనుసరించాలి. ముందు సన్నకారు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. కనీసం ముగ్గురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడాలి. దానికి డ్వాక్రా గ్రూపుల తరహాలో ఏదైనా పేరు పెట్టుకోవాలి. ప్రతి రైతు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ లతో పాటు బ్యాంకు నుంచి రుణాలు కట్టాల్సినవి పెండింగ్‌లో ఏవీ లేవని నిర్ధారించుకునేందుకు నో డ్యూ సర్టిఫికెట్‌ను జత చేయాలి. ఈ పత్రాలను రైతు భరోసా కేంద్రంలో అందించాలి. 


ఇది పూర్తయ్యాక పేరు పెట్టుకున్న గ్రూపుపైన ఒక బ్యాంకు అకౌంట్ తెరవాలి. జూన్ 2వ తేదీ లోగా ఈ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేస్తారో ఆ రైతులు ఈ రాయితీ ట్రాక్టర్ల కోసం అప్లై చేసుకునేందుకు అర్హులు అవుతారు. చివరికి రౌతులు రైతులు తమకు నచ్చిన ట్రాక్టర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ట్రాక్టర్‌కు సంబంధించిన వివరాలను కూడా రైతు భరోసా కేంద్రానికి తెలపాల్సి ఉంటుంది.


రైతు రథం కింద ఎంపికైన రైతు గ్రూపు యొక్క బ్యాంకు అకౌంట్‌కు ట్రాక్టర్ సబ్సిడీ మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేస్తారు. మిగతా డబ్బులు చెల్లించి రైతులు ట్రాక్టర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇలా గ్రూపులుగా ఏర్పడిన రైతులకు ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది. పురుగు మందులు పిచికారీ చేయడం కోసం డ్రోన్లను కూడా రైతులకు అందించనున్నారు.