ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గుడివాడ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. గుడివాడలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు సీఎం క్యాంపు ఆఫీసు అధికారులు గురువారం (జూన్ 8) ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, గుడివాడ పర్యటన వాయిదా వేయడానికి గల కారణాలను వెల్లడించలేదు.


గుడివాడ మండలం మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని జగన్ ప్రారంభించాల్సి ఉంది. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారని సీఎంవో గతంలో ప్రకటించింది. ముందస్తుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం వైఎస్ జగన్ గుడివాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మల్లాయపాలెం చేరుకోవాలి. అక్కడ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాలి. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.


గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గం కావడంతో ఆయన దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇప్పటికే నాలుగుసార్లు గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని.. ఇక్కడి నుంచి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదోసారి గెలుపుపై కన్నేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల వద్దకు బాగా తీసుకెళ్తున్నారు. అభివృద్ధి పనుల్ని కూడా వేగవంతం చేసి, నియోజకవర్గంలో మరోసారి తన ముద్ర వేసి ఇక తనకు తిరుగు లేకుండా చేయాలనే యోచనలో ఉన్నారు. ముఖ్యమంత్రితో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం ఏర్పాటు ఈయనే చేయించినట్లు తెలుస్తోంది.