కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ బ్యాంకర్లను కోరారు. ఇప్పటివరకూ 4,91,330 క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌కార్డ్స్‌ (సీసీఆర్‌సీలను) ఇచ్చామని, వీరికి సీసీఆర్‌సీ కార్డులను ఇవ్వడమే కాకుండా, ఆ డేటాను ఇ–క్రాపింగ్‌లో పొందుపరిచామని గుర్తు చేశారు. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? ఈ వివరాలను ఆర్బీకేలకు, ఇ–క్రాపింగ్‌కు, సీసీఆర్‌సీ కార్డులకు డేటాను అనుసంధానం చేశామని తెలిపారు. ‘‘ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగుచేస్తున్న రైతులు. సీసీఆర్‌సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్‌ద్వారా నిర్ధరిస్తున్నాం. అంతేకాదు, వీరు ఎక్కడ పంటను సాగుచేస్తున్నారో ఈ–క్రాపింగ్‌ద్వారా పరిశీలనచేసి ధృవీకరిస్తున్నాం. వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి. వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ కూడా పంటరుణాలు అందడం చాలా ముఖ్యమైన విషయం.’’ అని జగన్ బ్యాంకర్లతో అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం గురువారం జరిగింది.


ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్‌ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందని, పంపిణీ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిందని గుర్తు చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఇదే రకంగా దెబ్బతిందని అన్నారు. గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38 శాతం తగ్గిందని అన్నారు. దీని తదనంతర సంవత్సరం 2020–21లో కూడా కోవిడ్‌ విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగిందని అన్నారు. దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25 శాతం మేర పడిపోయిందని గుర్తు చేశారు.


‘‘మొదటి త్రైమాసికంలో అయితే 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను. ఇదే సందర్భంలో కొన్ని విషయాలను బ్యాంకర్ల ముందుకు తీసుకు వస్తున్నాను. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే టర్మ్‌ లోన్లు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో పంటరుణాలు 10.49శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం.’’ అని జగన్ అన్నారు.


31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు
‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌చేసి ఇచ్చాం. జియో ట్యాగింగ్‌ చేసి, వారి ఇంటి స్థలాన్ని వారిముందే అప్పగించాం. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా రూ.4–5లక్షల ఆస్తిని సమకూరుస్తున్నాం.’’


‘జగనన్న తోడు’తో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. 9.05 లక్షల మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టిసారించాలి.’’ అని జగన్ కోరారు.