YSR Aasara Pension: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పింఛన్ ను ఓ చోటు నుంచి మరో చోటుకు మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు తమ నివాసాన్ని ఓ చోటు నుంచి మరో చోటుకు మార్చుకునే సమయంలో ఆ వివరాలు గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీనికి తోడు ఇకపై ఎవరైనా అనర్హులకు పింఛన్లు మంజూరు చేస్తే.. అది పొరపాటున అయినా, కావాలని చేసినా మంజూరు చేసిన అధికారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే దీనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్న వేళ ఈ రూల్ పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు.
ఇటీవలే పింఛన్ పెంచిన ప్రభుత్వం..
ఎన్నికల్లో తాము పెన్షన్‌ను మూడు వేలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ హామీని నెరవేర్చేందుకు వచ్చే జనవరిలో ప్రస్తుతం ఇస్తున్న రూ. 2500 పెన్షన్‌ను రూ. 2750 చేస్తామని ఎపీ సీఎం జగన్ ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది మూడు వేలు చేస్తారు. డైరక్ట్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా ఇప్పటికి ప్రజలకు లక్షా 71 వేల 244 కోట్లను పంపిణీ చేశామని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో వివిధ వర్గాలకు చెందిన వారికి వైఎస్సార్ పింఛన్ కానుక కింద పింఛన్ గా రూ.2,500 రూపాయలు ఇస్తున్నారు. త్వరలో 2,750 రూపాయలు అందించనున్నారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడు వేల రూపాయలు కూడా చేయనున్నారు.
లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్ అందజేత..
రాష్ట్రంలో అర్హులైన వృద్ధులకు, పేదలకు, వితంతువులకు ప్రతీ నెల ఒకటో తేదీన వైఎస్సార్ పెన్షన్ కానుక పేరుతో ప్రభుత్వం పింఛన్ అందిస్తోంది. ఇప్పటికే పలు పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ వాలంటీర్లు అందిస్తున్నారు. వైఎస్సార్ పింఛన్ కానుకగా కూడా వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో పింఛన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతామని జగన్ నాడు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే 2022 జనవరి 1వ తేదీ నుంచి 250 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే ఏడాది 250 రూపాయలు కూడా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందే పింఛన్ ను 3000 రూపాయలు చేసే యోచనలు ఉన్నట్లు సమాచారం.
అన్ని రకాల వాళ్లకు పింఛన్లు..
ఏపీలో ఈ పింఛన్ కేవలం వృద్ధులకే కాదండోయ్ అన్ని రకాలుగా ఇబ్బందులో ఉన్న వారికి ఆర్థికంగా తోడ్పడుతుంది. వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత, డయాలసిస్ బాధితులు, ఒంటరి మహిళ, ట్రాన్స్ జెండర్, చర్మకారులు, తలసేమియా బాధితులు, పక్షవాతం, మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు కూడా అందిస్తోంది. ప్రభుత్వం ముందునుంచి చెబుతున్నట్లుగానే ప్రతీ నెలా 1వ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పింఛన్ కానుక పంపిణీ నిర్విరామంగా కొనసాగుతోంది. వచ్చే నెల ఒకటవ తేదీన 62.69 లక్షల మంది పింఛనర్లకు రూ.1594.66 కోట్లు అందించనున్నారు.