Chandrababu Comments: దేశంలో రూ.200, రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలని తాను బ్యాంకర్ల సమావేశంలో కోరినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం నిర్వహించి.. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన శ్వేతపత్రం విడుదల చేశాక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్.. ‘పులివెందుల ఎమ్మెల్యే జైలులో ములాఖత్‌లు అవుతూ.. ప్రభుత్వానికి పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు? దీనిపై స్పందనేంట’ని చంద్రబాబును అడిగారు.


దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అలాంటి వారు వ్యవస్థకే ఛాలెంజింగ్‌గా మారారని అన్నారు. కరడుకట్టిన ఆర్థిక నేరస్థులు సొమ్మును లూటీ చేసి, ఆ డబ్బుతో ఎక్కడికక్కడ ప్రలోభాలు చేస్తూ వ్యవస్థకే సవాలుగా మారారని అన్నారు. గత ఐదేళ్లుగా సంపాదించిన సొమ్ముతో ఏ వ్యవస్థనైనా కొనగలిగే సామర్థ్యం ఉందని ఆరోపించారు. ‘‘అందుకే పొద్దున బ్యాంకర్ల సమావేశంలో రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేయమని చెప్పాను. నగదు చెలామణి తగ్గించేసి.. ఎక్కడికక్కడ డిజిటల్ లావాదేవీలు ఉండేలా చేయాలని కోరాను. అవన్నీ లాంగ్ టర్మ్ లో ఫలితాలు చూపిస్తాయి. ఎన్ని బెదిరింపులు చేసినా అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డ నేరస్థులు ఈ ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరు. ఎక్కడా సహించేది లేదు. ఎవరికి భయపడేది లేదు. ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలని చూసినా, భయపడేది లేదు’’ అని చంద్రబాబు తేల్చి చెప్పారు.