చంద్రబాబు హౌస్ అరెస్టు పిటిషన్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మళ్లీ ఇరువర్గాల న్యాయవాదులను కోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో తీర్పు నేడు (సెప్టెంబరు 12) వెలువడనుంది.


చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఆయన్ను జైల్లో ఉంచకుండా, గృహ నిర్భంధంలో ఉంచాలని చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌, పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా ఉదయం వాదనలు వినిపించారు. తీర్పును నేటి సాయంత్రానికి రిజర్వు చేశారు. కానీ, తాజాగా తీర్పును నేటికి వాయిదా వేశారు. నేడు మూడు విడతల వాదనల అనంతరం హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.


జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని, ఆయనను జైల్లో ఉంచడం సరికాదని కోర్టులో ప్రస్తావించారు. హౌస్ రిమాండ్ అనేది ఇవ్వాలని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనల్లో భాగంగా.. గతంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తావించారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని సుప్రీం కోర్టు న్యాయవాది లుథ్రా కోర్టుకు విన్నవించారు. గౌతం నవర్కర్ కేసులో హౌజ్ రిమాండ్ కు సుప్రీం కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. 


అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. హౌస్ అరెస్ట్ ఇవ్వకూడదని, అలా చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు హౌస్ అరెస్టుకు ఛాన్స్ ఇస్తే కేసు కచ్చితంగా ప్రభావం అవుతుందని, సీఆర్‌సీపీలో హౌస్ అరెస్ట్ అనేది లేదన్నారు. ఇరువైపల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఈ అంశంపై న్యాయవాదులను మరింత క్లారిఫికేషన్ కోరింది. గతంలో ఏ కేసులలో హౌస్ అరెస్ట్ పిటిషన్ కు ఓకే చేశారో వాటి పూర్తి వివరాలు ఇవ్వాలని లాయర్లను కోర్టు అడిగింది. 


రాజకీయ కారణాలతోనే అరెస్టు - లాయర్ వాదనలు
చంద్రబాబును రాజకీయ కారణాలతో అరెస్ట్ చేశారని, ఎఫ్ఐఆర్ లో హడావుడిగా పేరు చేర్చి అరెస్ట్ చేసేలా కుట్ర చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును ఆదివారం (సెప్టెంబర్ 10) ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా వాదనలు జరిగిన తరువాత చంద్రబాబుకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం పోలీసులు చంద్రబాబును రోడ్డు మార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.


ఇంటి భోజనానికి కోర్టు అంగీకారం
చంద్రబాబుకు ఇంటి భోజనం అందించడానికి కోర్టు ఆదివారమే అంగీకరించడంతో సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు చంద్రబాబుకు బ్రౌన్ రైస్, పన్నీర్ కూర, బెండకాయ వేపుడు, పెరుగు పంపించారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని సహాయకుడితో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.