Life Threat To Chandrababu:
విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందని సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా సంచలన ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని, ఆయనను జైల్లో ఉంచడం సరికాదని కోర్టులో ప్రస్తావించారు. హౌస్ రిమాండ్ అనేది ఇవ్వాలని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనల్లో భాగంగా.. గతంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తావించారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సైతం వాదనలు జరగనున్నాయి.
అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. హౌస్ అరెస్ట్ ఇవ్వకూడదని, అలా చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు హౌస్ అరెస్టుకు ఛాన్స్ ఇస్తే కేసు కచ్చితంగా ప్రభావం అవుతుందని, సీఆర్‌సీపీలో హౌస్ అరెస్ట్ అనేది లేదన్నారు. ఇరువైపల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఈ అంశంపై న్యాయవాదులను మరింత క్లారిఫికేషన్ కోరింది. గతంలో ఏ కేసులలో హౌస్ అరెస్ట్ పిటిషన్ కు ఓకే చేశారో వాటి పూర్తి వివరాలు ఇవ్వాలని లాయర్లను కోర్టు అడిగింది.
చంద్రబాబును రాజకీయ కారణాలతో అరెస్ట్ చేశారని, ఎఫ్ఐఆర్ లో హడావుడిగా పేరు చేర్చి అరెస్ట్ చేయాలని కుట్ర జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరపున ఏఏబీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా వాదనలు జరిగిన తరువాత చంద్రబాబుకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం పోలీసులు చంద్రబాబును రోడ్డు మార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
చంద్రబాబుకు ఇంటి భోజనం అందించడానికి కోర్టు అంగీకరించడంతో సోమవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులు చంద్రబాబుకు బ్రౌన్ రైస్, పన్నీర్ కూర, బెండకాయ వేపుడు, పెరుగు పంపించారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని సహాయకుడితో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.