రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయ్యన్న పాత్రుడిని, ఆయన కుమారుడు రాజేష్ ని అరెస్టు చెయ్యడం తనకు దిగ్ర్బాంతి కలిగించిదని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని, ఇప్పటికే 10కి పైగా కేసులు పెట్టారని అన్నారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చి వేత మొదలు.. అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. 


చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్ల మీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. వైసీపీ సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీపై బీసీ నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్నను అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేష్ లను విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు చేశారు.






మాజీ మంత్రి, టీడీపీ నేతచింతకాయల అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) ను ఏపీ సీఐడీ (AP CID) పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఇంటి గోడ కూల్చివేత విషయంలో అయ్యన్న పాత్రుడు కోర్టుకు నకిలీ పత్రాలు సమర్పించారనే అభియోగంపై నర్సీపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్‌ను (Chintakayala Rajesh) కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాజమండ్రి వైపు తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సీఐడీ పోలీసులు సెక్షన్ సీఆర్పీసీ 50ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి తండ్రీ కొడుకులను అరెస్టు చేశారు. గోడ కూల్చివేత కేసులో కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించారనే అందుకే అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపీసీ సెక్షన్‌ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.


వారికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత - అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతి


అయ్యన్న పాత్రుడును అరెస్టు చేయడంపై ఆయన భార్య స్పందించారు. గత మూడు సంవత్సరాలుగా పోలీసులు తమను, తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. ఏదో ఓ కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి తన భర్తకు, కుమారుడికి ప్రాణహాని ఉందని అన్నారు. వారికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. 


రాత్రి వేళ రెండున్నర మూడు గంటలకు పోలీసులు గోడ దూకి దొంగల తరహాలో దౌర్జన్యంగా ఇంటి ఆవరణలోకి ప్రవేశించారని అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతి అన్నారు. పోలీసులు తలుపులు కొట్టి బీభత్సం చేశారని చెప్పారు. ఎవరు కావాలని తమ కుమారుడు అడిగినా పట్టించుకోకుండా అరెస్టు చేసి, తన భర్తను తోసుకుంటూ వెళ్లిపోయారని వాపోయారు. కనీసం బట్టలు మార్చుకొనే సమయం కూడా ఇవ్వలేదని, కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే తీసుకెళ్లిపోయారని చెప్పారు. ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్టు చేశారని అన్నారు. మేం ఏం తప్పు చేశామని ప్రశ్నించారు. పోలీసులు ఎవరూ కూడా ఐడీ కార్డు లేకుండా వచ్చారని, చాలా మంది తాగి వచ్చారని ఆరోపించారు.


గోడ కూల్చి వేత కేసు ఏంటంటే..


గతంలో అయ్యన్నపాత్రుడు ఉండే ఇంటి దగ్గర ప్రహరీ గోడ విషయంలో వివాదం చెలరేగింది. మాజీ మంత్రి అయిన ఈయన ఓ పంట కాలువ స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టారని కూల్చివేతకు అధికారులు సిద్ధం అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం వారు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో అయ్యన్న కుటుంబానికే ఊరట కలిగింది. తాజాగా అదే కేసులు అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారని అయ్యన్న పాత్రుడిని ఆయన కుమారుడిని అరెస్టు చేశారు.