వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మండపేట నియోజకవర్గంలో 946కోట్ల రూపాయల సంక్షేమ పథకాల ద్వారా అందించామని సీఎం జగన్ వెల్లడించారు. అవినీతి లేకుండా నిధులన్నీ లబ్ధిదారుల చేతిలోకి వెళ్లాయని ఆయన అన్నారు. 18నెలల్లో ఎన్నికలకు వెళుతున్న వేళ అప్రమత్తంగా ఉండి ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు.
ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం... వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాల వివరాలను గణాంకాలతో వివరించారు. 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉందని ఉత్సాహపరిచారు. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవచ్చు...కానా నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యలను సునాయాసంగా పరిష్కరించవచ్చని అన్నారు. ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయని...కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయని తెలిపారు.
సచివాలయ వ్యవస్థ చాలా కీలకం
2 వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పని చేసేటట్టుగా సచివాలయాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబాని సంక్షేమ పథకాలు అందించామన్నారు సీఎం జగన్. అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నామని అన్నారు. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్ విధానంలో అడుగులు వేశామని తెలిపారు. మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం బటన్ నొక్కి ప్రతి ఇంటికి అందజేశామని వివరించారు.
వైఎస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకొని క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాలు డీబీటీ ద్వారా ఆధార్ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది తెలిపారు. పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్ కాకుండా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు, అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోందని జగన్ అన్నారు.
గడప...గడప పై....
మొట్టమొదటిసారిగా గడప గడప అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోందన్నారు జగన్. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్ధి... సచివాలయ వ్యవస్ధ, మండల స్ధాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, జరిగిన మంచి వివరించేందుకు గడప గడప కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల ఆశీర్వాదాలు తీసుకుంటూ పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అటువంటి వారికి కూడా పథకాలు అందాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.
ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించామని, ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలన్నారు సీఎం జగన్. సచివాలయానికి రూ.20 లక్షలు అంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుందని వివరించారు. ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు ఉండి, ఒక్కోరోజు కనీసం 6 గంటలు ఆ సచివాలయంలో ఉండాలనే నిబంధన కూడా అమలు చేస్తున్నామన్నారు.
నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే...
మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయని, ఇందులో పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతమని జగన్ తెలిపారు. సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరాయి అని ఏకంగా ఆథార్ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలికే పరిస్థితుల్లో సహాయం చేయగలిగామని వివరించారు. గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92 శాతం ఇళ్లకు.. ప్రతి ఇంటికీ మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయనిన జగన్ వ్యాఖ్యానించారు. గ్రామం గెలిచినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు అని జగన్ అన్నారు.
మండపేటలో ప్రజా ప్రతినిదుల లెక్కలు ....
ఒక్క మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాల్టీతో సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లెక్క తీసుకుంటే.. మున్సిపాల్టీలో 30 కి 23 వైయస్సార్సీపీ, జడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్‌స్వీప్ చేశామని,ప్రజల దీవెనలు కనిపిస్తున్న, కారణం పాలన పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.