ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే దారిలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఊహించని పరిణామంతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే స్పందించి సిబ్బంది బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.
అమలాపురం గొల్లగూడెంకు వాసి ఆరుద్ర... ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. తన చేతిని తానే గాయపర్చకున్నారు. తీవ్రంగా రక్తం కారటంతో అక్కడే పడిపోయారు. తన కుమార్తె అనారోగ్య సమస్యలతో ఇల్లు అమ్ముకుంటే కానిస్టేబుల్ వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. సీఎంకు ఆవేదన చెప్పేందుకు ట్రై చేస్తుంటే ఎవరూ వెళ్లనీయడం లేదని అన్నారు.
స్పందనలో ఫిర్యాదు చేసినా పోలీసులు న్యాయం చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆరుద్ర. కానిస్టేబుల్ కన్నయ్య గతంలో ఓ మంత్రి వద్ద గన్ మెన్‌గా పని చేశారు. విషయం తెలియటంతో కానిస్టేబుల్ కన్నయ్యను మూడు నెలల క్రితమే మంత్రి పంపేశారు.
లోకేష్ కామెంట్స్
సీఎం జగన్ నివాసం ముందే న్యాయం కోసం మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి పాలనలో సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో అభినవ నీరో జగన్ రెడ్డికి కాకినాడలో వైసీపీ నేతల అరాచకాలు కనపడవుని ఎద్దేవా చేశారు. అచేతన స్థితిలో ఉన్న కుమార్తెకి వైద్యం చేయించలేని ఆడపడుచు ఆరుద్ర ఆత్మహత్యాయత్నం ఆర్తనాదాలు వినపడవా అని నిలదీశారు. బాధితురాలికి తక్షణమే సాయం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఏపీ పోలీస్ శాఖ వివరణ...
ఈ ఘటన సంచలనంగా మారటంతో ఏపీ పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర ఈ రోజు (02-11-2022) తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీపంలో చేయి కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారని తెలిపారు. తన ఇల్లు అమ్మకం విషయంలో అన్యాయం జరిగినట్లు చేసిన ఆరోపణలపై సంక్షిప్త వివరణ ఇస్తూ డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 12న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాకినాడ రాయుడుపాలెంలో నివాసముంటున్న, రాజులపూడి ఆరుద్ర మహిళ అన్నవరం గ్రామములో రాజాల చిట్టిబాబు, ముత్యాలరావు, మెరపల శివ, మెరపల కన్నయ్యపై కొన్ని ఆరోపణలు చేశారు.
ఆరుద్ర ఫిర్యాదు మేరకు అన్నవరం పి.ఎస్.లో సెప్టెంబర్ 13న కేసు నమోదైనట్టు డీజీపీ కార్యాలయం చెప్పింది. ఆరుద్ర కుమార్తె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆసుపత్రి ఖర్చుల కోసం తన ఇంటిని అమ్మాలని ప్రతిపాదన చేశారు. ఆగస్టు 29న కాకినాడలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆరుద్ర మీడియాతో మాట్లాడుతూ మెరపల చిన్నమ్మలు కుమారుడిపై ఆరోపణలు చేశారు. 40 లక్షలు విలువ చేసే ఇంటిని 10 లక్షలకు అమ్మాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు.
ఈ విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోవాలని ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, పరస్పరం చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు పోలీసులు. ఆరుద్ర ఇంటిని విక్రయించడానికి పోలీసులు సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈలోపు మెరపల చిన్నమ్ములు కూడా ఫిర్యాదు చేయడంతో అన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది.
చిన్నముల ఫిర్యాదులో A-1 రాజులపూడి ఆరుద్ర, A-2 రాజులపూడి భువనేశ్వర్, A-3 భీమన్నగా పేర్కొన్నారు. రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయి. ఆరుద్ర పెట్టిన కేసు కొట్టేయాలని మెరపల శివ అన్నదమ్ములు హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో అన్ని చర్యలను 8 వారాలపాటు నిలిపి వేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కన్నయ్య మంత్రి వద్ద నుంచి గన్ మెన్‌ను విధుల నుంచి తప్పించి జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు పంపామని డీజీపీ కార్యాలయం వివరించింది. శివను ఇంటలిజెన్స్ విభాగం నుంచి వెనుక్కి పంపినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. పోలీసు శాఖా పరంగా తీసుకోవలిసిన చర్యలన్నీ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఈ రెండు కేసులను అన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.