YSRCP central Office at Tadepalle: 
అమరావతి : తాడేపల్లిలోని అధికార వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఓ కారు కలకలం రేపింది. వైసీపీ నేతలు తమ వద్ద రూ.16 కోట్ల ఆస్తిని లాక్కుని మోసం చేశారని గుర్తుతెలియని వ్యక్తి కారుకు స్టిక్కర్లు అతికించాడు. జగనన్న తనకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కారును వైసీపీ ఆఫీసు వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దాంతో కాసేపు అక్కడ హైడ్రామా నడిచింది. 


అసలేం జరిగిందంటే..
కొందరు వైసీపీ నేతలు తమను కోట్లాది రూపాయలు మోసం చేసారని, న్యాయం చేయాలని సీఎం జగన్ ను పరోక్షంగా రిక్వె్స్ట్ చేశారు. అందుకు ఓ కారును, కొన్ని స్టిక్కర్లను వినియోగించారు. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి తమను రూ.16 కోట్ల ఆస్తి మోసం చేశాడని బాధితుడు ఆరోపించారు. మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి అని స్టిక్కర్ కారుకు అతికించి ఉంది. తనకు జరిగిన అన్యాయం వివరాలతో పాటు మోసం చేసిన వ్యక్తి ఫొటోను రెనాల్ట్ క్విడ్ కారు చుట్టూ పోస్టర్లుగా అతికించారు. తనను మోసం చేసిన వ్యక్తి గతంలో సీఎం జగన్ తో కలిసిన ఓ ఫొటోను అతికించి ఉండటంతో కలకలం మొదలైంది. 


తాను రూ.16 కోట్లు మోసపోయాని, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తే దొంగ అని పోస్టర్లు వేశాడు బాధితుడు. జగనన్నపై తనకు నమ్మకం ఉందంటూనే, పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిందితుడ్ని అరెస్ట్ చేయాలని కోరారు. తనకు న్యాయం చేయలేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కారుపై పేపర్ అతికించారు. కాల్ మీ అంటూ 9502926700 తన మొబైల్ నంబర్ ను కారు బానెట్ పై రాసిపెట్టారు. ఈ కారు వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్కింగ్ చేసి ఉండటంతో అటుగా వెళ్లేవారు ఆసక్తిగా గమనించారు. తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ప్రయత్నం చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.