దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడలో బేజీపీ శక్తి కేంద్రంలో ప్రముఖలను ఉద్దేశించి నడ్డా మాట్లాడారు.
ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లడానికి ఇదే మంచి అవకాశమని కార్యకర్తలకు హితోపదేశం చేశారు. కేంద్రం చేస్తున్న పథకాలు వివరించాలని సూచించారు. కొత్త ఓటర్లను బీజేపీ వైపు చూసేలా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పుస్తకాలు రాష్ట్ర బీజేపీ ప్రింట్ చేసి ప్రజలకు పంచి పెట్టాలన్నారు.
ప్రధాని మోదీ చేపట్టే మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని బూత్ స్థాయి కార్యకర్తలంతా సామూహికంగా వినాలని సూచించారు నడ్డా. ఆయన చెప్పిన సందేశాన్ని ప్రజలతో చర్చించాలన్నారు. కేంద్రంపై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత శక్తి కేంద్రాల ప్రముఖులకు ఉందని నడ్డా సూచించారు.
ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు చేశారు జేపీ నడ్డా. ప్రస్తుతం బీజేపీ... కొన్ని కుటుంబాల నుంచి దేశాన్ని రక్షించేందుకు పోరాడుతోందన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో ఇంకా కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయని.. వాళ్లను కచ్చితంగా ఓడించి సరికొత్త భారతావని నిర్మించాలన్నారు. కుటుంబ పాలన దేశ, రాష్ట్రాభివృద్ధికి ప్రమాదకరమని ఆరోపించారు నడ్డా.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు జేపీ నడ్డా. టిడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ అదే కోవలోకి వస్తాయన్నారు. పక్కరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌లో కూడా అదే చూస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం ఇస్తున్న డబ్బులతోనే పాలన సాగుతోందన్నారు బీజేపీ చీఫ్ నడ్డా. అందుకు ఉదాహరణగా ఆయుష్మాన్ భారత్ పేరు ప్రస్తావించిన నడ్డా. ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రజల కోసం గొప్ప ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తే దాన్ని ఆరోగ్య శ్రీగా పేరు మార్చి జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. అది జగన్ స్కీం కాదని.. నరేంద్ర మోదీదని కామెంట్ చేశారు నడ్డా. ఆయుష్మాన్ భారత్ పథకంతో ఐదు లక్షల వరకు వైద్య సాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ లీడర్లు, కార్యకర్తలకు నడ్డా పిలుపునిచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఎక్కడైనా పని చేస్తుందని.... ఆరోగ్య శ్రీ రాష్ట్రం పరిదిలోనే పని చేస్తుందన్నారు.