అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు(Government Teachers) పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇకపై నాన్‌టీచింగ్ ప్రోగ్రామ్స్‌కు వాళ్లను పంపించ వద్దని అధికారులకు ముఖ్యమంత్రి జగన్(CM Jagan) సూచించారు. వాళ్లను కేవలం బోధనకు పరిమితం చేయాలని సలహా ఇచ్చారు.
కొత్త విద్య విధానంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ విద్యాశాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. నూతన విద్యా విధానానికి విద్యార్థులను, ఉపాధ్యాయులను, సమాయత్తం చేయాలని సూచించారు.
విద్యార్థులకు రోజుకో ఇంగ్లీష్ పదం
విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలను వాటి అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఫిబ్రవరి 14 నుంచి ప్రతి రోజూ ఒక ఇంగ్లీష్ పదం నేర్పుతున్నట్టు సీఎం జగన్‌కు వివరించారు. వచ్చే ఏడాది డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారలకు సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక కో- ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్ కళాశాల లేని మండలాలు గుర్తించి త్వరగా కాలేజీరు ఏర్పాటు అయ్యేలా చూడాలన్నారు. స్కూల్‌లో సమస్యలు తెలుసుకునేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని దానికి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు చెప్పారు.
అలాంటి విధులు టీచర్స్‌కు వద్దు
ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత విద్యావంతులు పాఠాలు చెబుతున్నారని.. వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు సీఎం జగన్. అందుకే వాళ్లను బోధనేతర పనులకు వాడుకోవద్దని అధికారులకు తెలిపారు. అలా చేయడం వల్ల విద్యార్థుల చదువులు దెబ్బ తింటాయని అభిప్రాయపడ్డారు. ఇకపై టీచర్లు పూర్తిగా విద్యార్థులకే అందుబాటులో ఉండాలన్నారు.
నాడు నేడులో భాగంగా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు
కొత్తగా ఏర్పటు కాబోయే 26 జిల్లాల్లో కూడా టీచర్ ట్రైనింగ్ సెంటర్‌లు ఉండాలన్నారు సీఎం జగన్. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
జూన్ నాటికి విద్యా కానుక
మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు నేడు రెండో విడత మొదలు పెట్టాలని ఆదేశించారు సీఎం జగన్. స్కూళ్లల్లో ప్లే గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలన్న జగన్... దీనికి సంబంధించిన మ్యాపింగ్ చేసి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక అందిలా ఏర్పాటు పూర్తి చేయాలన్నారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో సౌకర్యాలపై దృష్టి
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల సౌకర్యాలతోపాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలని ఆదేశించారు సీఎం జగన్. తల్లిదండ్రులు కడుతున్నఫీజులకు అనుగుణంగా వసతులు ఉండాలన్నారు.
రాష్ట్ర యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ప్రణాళికలు రెడీ చేయాలని చెప్పారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక నైపుణ్యాభివృద్ధి కాలేజీ ఉండాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల ఉండాలని చెప్పారు. వీటన్నింటికీ సిలబస్ తయారు చేసేందుకు స్కిల్ యూనివర్శిటీ రూపొందించాలన్నారు. దీన్ని తిరుపతిలో పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు అధికారులకు వివరించారు జగన్.