ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఇళ్ల స్థలాలు పొందిన కొందరు లబ్ధిదారులు అందులో ఇల్లు కట్టుకొనేందుకు నిరాకరిస్తున్నారు. దాదాపు 95 వేల మంది లబ్ధిదారులు తమకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోబోమని చెబుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. లబ్ధిదారులకు దక్కిన ఇళ్లు అప్పటికే నివాసం ఉంటున్న ప్రాంతాలకు దూరంగా ఉండడం, శ్మశానాలు, కర్మాగారాలకు దగ్గరగా ఉండడంతో లబ్ధిదారులు అక్కడ ఇల్లు నిర్మించుకొనేందుకు ఆసక్తి చూపడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తమకు మరోచోట స్థలాలు కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటామని లబ్ధిదారులు చెబుతున్నారని అధికారులు చెప్పారు. అయితే, ఇప్పుడు వీరందరికీ ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించడంపై ప్రభుత్వం సందిగ్ధతలో పడినట్లు తెలుస్తోంది. అందు కోసం దాదాపు రూ.800 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది.
‘‘లబ్ధిదారులు కోరినట్లుగా చేయాలంటే మేం అదనంగా 2 వేల ఎకరాల భూమిని ప్రైవేటు యజమానుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇంతకుముందు మేం లబ్ధిదారులకు ఇచ్చినదంతా ప్రభుత్వ భూమి’’ అని గృహ నిర్మాణశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
సీఎం జగన్ దృష్టికి సమస్య
ఈ విషయం గురించి అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మొత్తం 95,106 మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో తాము ఇల్లు కట్టుబోమని చెబుతున్నారని వివరించారు. ఇంతకుముందు ఒక్కో లబ్ధిదారుడికి ఒకటిన్నర సెంట్ల స్థలం ఇచ్చారు. అయితే, ఇలా ఇల్లు కట్టుకోబోమని మొండికేస్తున్న వారిలో కనీసం 30 శాతం స్థలాలు శ్మశానాలకు సమీపంలో ఉండడం లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. మరో 30 శాతం కేసులు పల్లెలు లేదా పట్టణాలకు చాలా దూరంగా ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు.
ఈ సమస్యను కొంత వరకూ పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నించారు. కొన్ని జిల్లాల్లో రెండు లేదా మూడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఒకే లే అవుట్ లో స్థలం కేటాయించారు. అది కూడా ఊరికి దూరంగా ఉండడంతో లబ్ధిదారులు తమ ఊర్లోనే తమకు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఇల్లు కట్టుకోబోమని చెబుతున్న వారు 50 వేల మంది మాత్రమే ఉన్నారని, వారి సమస్య పరిష్కరిస్తామని గృహ నిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడామని వారికి మరో చోట భూములు గుర్తించడానికి సర్వే చేయించాలని ఆదేశించినట్లుగా చెప్పారు. ఒక్కసారి సర్వే పూర్తయ్యాక భూమి సేకరించి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
‘‘రాష్ట్రంలో మొత్తం 30.3 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ల పట్టాలు అందించాం. అందులో కేవలం 1.5 శాతం అంటే 50 వేల లబ్ధిదారులు వేర్వేరు కారణాల వల్ల తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని కోరారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం జగన్ కు చెప్పారు. దీంతో లబ్ధిదారులకు వారికి కావాల్సిన చోట స్థలం చూపించి వారికి 100 శాతం సంతృప్తి కలిగేలా పని చేయాలని చెప్పారు. సీఎం సూచనల ప్రకారం మేం వారి కోసం పని చేస్తున్నాం. లబ్ధిదారులు కోరుతున్న చోట భూములను గుర్తించేందుకు సర్వే చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అది పూర్తయ్యాక భూములను సేకరించి, లబ్ధిదారులకు మొత్తం స్థలాలు వారు కోరుకున్నచోట కేటాయిస్తాం’’ అని గృహ నిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ బీఎం దివాన్ మిదీన్ వివరించారు.