Jagananna Arogya Suraksha: ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో విషాద ఘటన జరిగింది. విధులు నిర్వహిస్తూ ఓ ఆశా వర్కర్‌ మృతి చెందారు. తాడేపల్లిలోని ప్రకాశ్‌నగర్‌ వైఎస్‌ఆర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో శుక్రవారం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆశావర్కర్‌ కృపమ్మ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. సిబ్బంది వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కృపమ్మ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారుల ఒత్తిడే కృపమ్మ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 30న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమైంది. స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్‌ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పె­షలిస్ట్‌ వైద్యుల సేవలను అందిస్తున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.  


ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలను అందిస్తున్నారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉంటుున్నారు. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్‌ సప్లిమెంటేషన్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్‌ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్‌ఎం, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.  


టోకెన్లు లేకున్నా వైద్య సేవలు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు.  రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.