మంగళగిరి ఎయిమ్స్‌లో ఇకపై ఆరోగ్య శ్రీ సేవలు అందనున్నాయి. అందరికీ ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంలో భాగంగా ఎయిమ్స్‌లో ఏపీ ప్రభుత్వం ఒప్పందం పెట్టుకుంది. ఇప్పటికే ట్రయల్ రన్‌లో భాగంగా వందల మందికి ఉచితంగా చికిత్స అందించారు. 


మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో పేద‌లంద‌రికీ ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవ‌లు అందిస్తామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఎయిమ్స్ - రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ఆరోగ్య‌శ్రీ విష‌య‌మై అవ‌గాహ‌న ఒప్పందం జ‌రిగింది. ఇరు ప‌క్షాలు ఎంవోయూ ప‌త్రాలు మార్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ... పేద‌లంద‌రికీ ఉచితంగా నాణ్య‌మైన వైద్యం అందించాల‌నే రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆలోచ‌న‌ల మేర‌కు ఎయిమ్స్‌తో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని తెలిపారు. కొద్ది రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్య‌శ్రీ ట్ర‌య‌ల్ ర‌న్‌ను చేప‌ట్టామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే 100 మందికిపైగా రోగుల‌కు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్య‌శ్రీ సేవ‌లు అందించామ‌ని తెలిపారు. 30 మందికిపైగా చికిత్స చేయించుకుని ఇంటికి కూడా చేరుకున్నార‌ని వివ‌రించారు. 


ఇప్పుడు అధికారికంగా ఇరు ప‌క్షాల మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో ఆరోగ్య‌శ్రీ ల‌బ్ధిదారులంద‌రికీ పూర్తి ఉచితంగా వైద్య సేవ‌లు అందుతాయ‌ని చెప్పారు. దీనివ‌ల్ల పేద‌ల‌కు వైద్య సేవ‌లు మ‌రింత నాణ్యంగా పూర్తి ఉచితంగా అందుతాయ‌ని పేర్క‌న్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందించటమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.


క్యాన్స‌ర్‌కు పెట్ సిటీ స్కాన్‌ ...


ఎయిమ్స్‌లో అతి త్వ‌ర‌లో పెట్ సిటీ స్కాన్‌ను ప్రారంభించ‌బోతున్నామ‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని పేర్కొన్నారు. శ‌రీరంలో ఎక్క‌డ క్యాన్స‌ర్ అవ‌శేషాలు ఉన్నా స‌రే ఈ స్కాన్ ద్వారా ప‌సిగ‌ట్టేయొచ్చ‌ని తెలిపారు. క్యాన్స‌ర్‌కు అంత‌ర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. ఎయిమ్స్ కు ఇప్పుడు రోజుకు ఆరు ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని అందిస్తున్నామన్నారు. మంగ‌ళ‌గిరి- తాడేప‌ల్లి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ల నుంచి మూడేసి ల‌క్ష‌ల లీట‌ర్ల చొప్పున మొత్తం ఆరు ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని వివ‌రించారు. దీనివ‌ల్ల ఎయిమ్స్ లో పూర్తి బెడ్ సామ‌ర్థ్యం మేర వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని పేర్కొన్నారు. వ‌చ్చే జూన్ క‌ల్లా పైపు లైను ప‌నులు కూడా పూర్త‌వుతాయ‌ని చెప్పారు. ఇదిమంచినీటి స‌మ‌స్యకు శాశ్వ‌త ప‌రిష్కారం అని వెల్ల‌డించారు. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు ఎయిమ్స్ లో 24 గంట‌లూ అందించాల‌ని, అందుకోసం అదనంగా ఆరోగ్య‌మిత్ర‌ల‌ను కూడా నియ‌మించుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎయిమ్స్ నుంచి రోగుల‌ను మంగ‌ళ‌గిరికి చేర్చేందుకు ఉచిత వాహ‌న సౌక‌ర్యం క‌ల్పించాల‌ని సూచించారు.స్పందించిన అధికారులు వెంట‌నే ఉచిత వాహ‌నాన్ని ఏర్పాటుచేస్తామ‌ని తెలిపారు.ఇందుకు అవసరం అయితే దాతల సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు.


పేదలకు వైద్యం అందిస్తుంటే రాజకీయాలా...


ప్రభుత్వం పేదలకు వైద్యం అందించేందుకు చేస్తున్న పనులను అవవసరంగా రాజకీయం చేయవద్దని మంత్రి రజని హితవు పలికారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ను పూర్తి స్దాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రధాన ఉద్దేశమని ఇందులో రాజకీయ కోణం చూడటం సమంజనం కాదని తెలిపారు.