Sharmila Comments : ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 

Telugu News:

Continues below advertisement

వైసీపీ అధినేత, సీఎం జగన్‌, ఆపార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ భార్య భారతీ రెడ్డిపై కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. 

Continues below advertisement

వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ గొడలితో నరికేయాలి. వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి ఇదే భారతీ రెడ్డి స్ట్రాటజీ అంటూ విమర్శలు చేశారు. గొడ్డలితో అందర్నీ నరికేస్తే ఎవరూ పోటీ చేయరని అప్పడు సింగిల్ ప్లేయర్‌గా ఉండొచ్చని సలహా ఇచ్చారు. 
ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోవడానికి అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పాస్‌పోర్టులు రెడీ చేసుకున్నారని అన్నారు. ఓడిపోయిన తర్వాత నడుస్తున్న కేసుల్లో అరెస్టు తప్పదని వాళ్లందరికి తెలుసు అన్నారు.  అందుకే ఆ అరెస్టు నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో ఉన్నారని విదేశాలకు పారిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. 

అంతకు ముందు రోజూ రాస్తున్నట్టే ఎనిమిదో రోజు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌రెడ్డికి తొమ్మిది ప్రశ్నలు సంధించారు. 
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఉందా, ఉంటే ఏదని అడిగితే ఏం సమాధానం చెప్పాలో రాష్ట్ర ప్రజలెవరికీ అంతుబట్టని స్థితి ఉందన్నారు. ఒకప్పుడు ఎంతో ఉజ్వలంగా వెలిగిన ఏపీకి, రాష్ట్ర విభజనే ఒక శాపం అయిందంటే... తదనంతరం రాజధాని సమస్యైందన్నారు. ఇప్పుడు రాజధాని ఏదంటే తడుముకునే పరిస్థితి కల్పించారని విమర్శించారు. విభజన తర్వాత రూపుదిద్దుకుంటూ ఉన్న అమరావతికి మీరు రూపురేఖలే లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులన్నారు కానీ ఎక్కడా వాటికి సంబంధించిన ఏర్పాట్లు లేవు అన్నారు. 

రాష్ట్ర ప్రజల్ని రెంటికి చెడ్డ రేవడిని చేశారని ఫైర్ అయ్యారు షర్మిల. నిజంగా రాష్ట్ర ప్రజల అవసరాలు, సంక్షేమం మీద చిత్తశుద్ది ఉంటే, ప్రజలడిగే సందేహాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

1) ఆంధ్రప్రదేశ్‌కు ఇవాళ రాజధాని ఏది? పోనీ, సీఎంగా మీరైనా స్పష్టతతో ఓ సమాధానం చెప్పండి?

2) అమరావతి రాజధానికి ప్రతిపక్షనేతగా అంగీకరించిన మీరు, అధికారంలోకి వచ్చాక సీఎంగా అమరావతికి వ్యతిరేకంగా, అమరావతిపైన ఎందుకంత కక్ష కట్టారు?

3) అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని మీరు మారుస్తారని ప్రచారం జరుగుతోంది అని ఎన్నికల ముందు అంటే, ‘‘చంద్రబాబుకు ఇల్లైనా లేదక్కడ, నేను అక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను’’ అని ఒక టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చెప్పింది నిజం కాదా?

4) అమరావతిలోనే ఉండాలని, రాజధానిని మరెక్కడికీ తరలించవద్దని హైకోర్టు ధర్మాసనం విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మార్చాలని, మూడు రాజధానులుగా విడగొట్టాలనే పట్టుదల ఎందుకు?

5)మీ సహాయనిరాకరణ వల్లే అమరావతికి మెట్రో రైలు, అవుటర్‌ రింగ్‌రోడ్డు, కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి, విజయవాడ`గుంటూరు రైల్వే ప్రాజెక్టు రాకుండా పోయాయనేది నిజం కాదా?

6) రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నాలుగున్నరేళ్లుగా ఉద్యమిస్తుంటే వారితో చర్చలు జరిపి, వారి ఆర్తి ఏమిటో తెలుసుకునే కనీస బాధ్యత ఎన్నికైన ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండదా?

7) దేశంలో మున్నెన్నడు లేని విధంగా 29 వేల రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభత్వానికి అప్పజెబితే, వారి ప్రయోజనాలను విస్మరించిన ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దింపొద్దంటారు? 

8) కార్యాలయాలు అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించవద్దని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ‘ఉత్తరాంధ్ర అభివృద్ది`సమీక్ష’ సాకుతో మీరు దొడ్డిదారిన ‘తరలింపు’ జరుపుతున్నది నిజం కాదా?

9) ‘రాజధాని విషయంలో 2019 ఎన్నికల ముందు ఇచ్చిన మాట నేను తప్పానని మీరు భావిస్తే నాకు ఓటు వేయకండి’ అని ఏపీ ప్రజలకు అప్పీల్‌ ఇవ్వగలరా?
సరైన సమాధానాలు, సమగ్ర వివరాలతో ఈ ‘నవసందేహాల’ను తీర్చిన తర్వాతనే రాష్ట్ర ప్రజానీకాన్ని ఓట్లు అడగాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని డిమాండ్‌ చేస్తున్నాం. అంత వరకు రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు వైసీపీకీ,  ముఖ్యమంత్రికి లేదు అని అన్నారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola