YS Sharmila: అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధానమంత్రి మోదీకి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గిఫ్టు పంపించారు. ఈసారైనా న్యాయం చేయాలని అభ్యర్థించారు.
ప్రధానమంత్రి మోదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభించనున్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారైనా మట్టీ నీళ్లు తీసుకురాకుండా నిధులు తీసుకురావాలని ఏపీ కాంగ్రెస్ చీప్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మోదీకి గిఫ్టు పంపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తూ వస్తున్న మోదీ ఈసారైనా నిధులతో రావాలని షర్మిల డిమాండ్ చేశారు. గతంలో మట్టీ నీళ్లు తెచ్చి ప్రజల ఆశలపై నీళ్లు చెల్లారని అన్నారు. వాటిని గుర్తు చేస్తూ అమరావతి మట్టిని మోదీకి గిఫ్టుగా పంపించారు షర్మిల. సోషల్ మీడియా వేదికగా మోదీ టూర్‌పై స్పందించిన షర్మిల...." ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈసారైనా అమరావతి కట్టేనా? లేక మళ్ళీ మట్టేనా? అని ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీ గారికి... ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నాం." అని అన్నారు.
అమరావతి మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలని ఆకాంక్షించారు షర్మిల. 10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలన్నారు. మళ్లీ ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలన్నారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యతని గుర్తు చేశారు. ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలన్నారు.
రాజధాని అమరావతి కోసం అప్పులు వద్దని షర్మిల నినదించారు. భావితరాల మీద రుణభారం మోపొద్దని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లు 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేపటి సభావేదికపై ఈ ప్రకటన మోదీ చేయాలన్నారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అన్నారు షర్మిల. అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ మీటింగ్‌కు షర్మిలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది.