AP Govt issued 8 GOs on Employees PRC at high level meeting: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలుకు సంబంధించిన వివిధ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈమేరకు అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పీఆర్సీ అమలుకు సంబంధించిన సమావేశం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్‌ల సమక్షంలో జరిగింది. ఈసందర్భంగా పీఆర్సీ అమలుకు సంబంధించిన 8 ప్రభుత్వ ఉత్తర్వులను (8 GOs on PRC issued) జారీ చేసి, ఆ జీవోల ప్రతులను సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఆర్ధికశాఖ అధికారులు అందచేశారు.. 


మధ్యంతర భృతి.. 
బుధవారం ఇచ్చిన జీవోలలో జూలై 1, 2019 నుండి మార్చి 31, 2020 కాలానికి ప్రభుత్వ ఉద్యోగులకు (AP Govt Employees) మధ్యంతర భృతి, పదవీ విరమణ సమయంలో ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021కి సంబంధించిన బకాయిలు చెల్లించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. పీఆర్సీ అమలుకు సంబంధించి బుధవారం 8 జీవోలను జారీ చేశామన్నారు. మరో రెండు జీవోలను కూడా బుధవారం రాత్రికి లేదా గురువారం విడుదల చేయనున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చెప్పారు. మరికొన్ని జీవోలు త్వరలో విడుదల అవుతాయని అన్నారు. 


ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ పెండింగ్ అంశాల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అదే విధంగా వివిధ పెండింగ్ బిల్లులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పీఆర్సీతో పాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 


ఈసమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి, ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, ఇంకా ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.


Also Read: ఉపాద్యాయ సంఘాల ఆందోళ‌న పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం


Also Read: AP PRC News: ఈ ప్రభుత్వం మీది.. మీరు లేకపోతే నేను లేను, మీకు సాధ్యమైనంత చేశాం: సీఎం జగన్‌