యువగళం పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ సంపాదనపై, తన సంపాదనపై సీబీఐ ఎంక్వైరీ వేద్దాం అని మంత్రి రోజా సవాల్ విసిరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేరుగా ఎదురు పడితే లోకేష్ గుండె ఆగిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌ అంకుల్‌ ఒక ఐరెన్‌లెగ్‌ అని ఫైర్ అయ్యారు.
లోకేష్ పై మంత్రి రోజా సీరియస్ కామెంట్స్...
లోకేష్ ఎవరు అంటే చంద్రబాబు  కుమారుడు.. బ్రాహ్మణి  భర్త అని  చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. లోకేష్  ఇంకోసారి తన గురించి మాట్లాడితే అడవాళ్లతో కొట్టిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో నరకం చూపించినా ఎదుర్కొని  నిలబడ్డానని, కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి  వచ్చిన వ్యక్తులతో లోకేష్  పాదయాత్ర  చేస్తున్నారని రోజా ఆరోపించారు. మా నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు  నిన్న  లోకేష్ ను కొట్టడానికి  వచ్చారని రోజా తెలిపారు. లోకేష్ అనే వ్యక్తి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని పక్కన పెట్టాడని రోజా విమర్శించారు. జబర్దస్త్ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం జగన్  గురించి మాట్లాడితే  పళ్లు   రాలతాయని హెచ్చరించారు.
దమ్ముంటే లోకేష్ సంపాదన తన సంపాదనపై సీబీఐ ఎంక్వైరీ వేద్దాం అని మంత్రి రోజా సవాల్ విసిరారు. తాను  కష్టపడి  షూటింగ్స్ చేసి ఇల్లు  కట్టుకున్నానని, హెరిటేజ్ వెహికిల్  లో  ఎర్ర చందనం  తరలించింది ఎవరు అని రోజా ప్రశ్నించారు. జగన్ పులి అయితే.. లోకేష్  పులకేసి అని ఎద్దేవా చేశారు.
లోకేష్ ఐరన్ లెగ్...
లోకేశ్‌ అంకుల్‌ ఒక ఐరన్‌ లెగ్‌ అని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఆయన చేస్తున్నది పాదయాత్ర కాదని.. "జోకేశ్‌" యాత్ర అని ఎద్దేవా చేశారు. లోకేశ్‌ రాజకీయ ఎంట్రీతోనే టీడీపీ అధినేత చంద్రబాబు పతనం ఆరంభం అయ్యిందన్నారు. అవినీతికి కేరాఫ్‌ నారా కుటుంబం అని విమర్శించారు. రెండెకరాల చంద్రబాబు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు.
లోకేశ్ పక్కనే ఎర్ర చందనం దొంగలు... !
ఇసుక దొంగల్ని, ఎర్ర చందనం దొంగల్ని తన పక్కన పెట్టుకుని లోకేశ్‌ మాట్లాడుతున్నాడంటే.. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి.. అంటూ అందరూ నవ్వుకుంటున్నారని రోజా మండిపడ్డారు. లోకేశ్‌ ఎవరినైతే పక్కనబెట్టుకుని గెలిపించమని మాట్లాడుతున్నాడో.. అతనే పెద్ద చందనం దొంగ అని.. ఇసుక దోచేసిన పెద్ద దొంగగా.. లిక్కర్‌ కేటుగాడని, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులో నాలుగు లైన్లు చదవడానికే లోకేశ్‌ ఇబ్బందిపడుతున్నాడంటే, రాజకీయాల్లో గట్టిగా ఏ ఒక్క విషయంపైనా స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తి ని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఏవేవో అవాకులు చెవాకులు మాట్లాడితే నగరి ప్రజలెవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పారు.
సీబీఐ విచారణకు సిద్ధమా.. చంద్రబాబు, లోకేష్ లకు సవాల్?
ఏ కేసు పెట్టినా స్టేలు తెచ్చుకుని తప్పించుకుని తిరిగే అలవాటున్న చంద్రబాబుకు, లోకేశ్‌కు తాను సవాల్ చేస్తున్నానని రోజా అన్నారు. మీ ఆస్తుల మీద.. నా ఆస్తుల మీద సీబీఐ చేత ఎంక్వైరీ చేయించడానికి సిద్ధమేనా అని రోజా ప్రశ్నించారు. ఎవరివి అవినీతి ఆస్తులు.. ఎవరివి కష్టపడి షూటింగులు చేసుకుని సంపాదించిన సొమ్ము అనే సంగతి ప్రజలకు అర్ధమౌతుందని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఇంటికి డబ్బు సంచులు ఏ విధంగా వచ్చాయో బయటకొస్తే చాలు.. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితి జీరోకి దిగజారుతుందని రోజా ఎద్దేవా చేశారు. ఈ సారి 23 సీట్లు కూడా గల్లంతవడం ఖాయమని, ఇప్పటికైనా లోకేశ్, చంద్రబాబు ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం మానుకోవాలని రోజా హితవు పలికారు.