Vanitha On Tadepalli Incident : రాష్ట్రంలో నేరం ఎవరూ చేసినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి తాడేపల్లిలో మైనర్ బాలిక హత్యోదంతంపై నిందితుడిని గంటసేపట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. జగనన్న ప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా, ఎలాంటివాడు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మహిళలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. 


మద్యం మత్తులో మర్డర్ 


తాడేపల్లిలో మైనర్‌ బాలిక హత్యకు గురవ్వడం బాధాకరమని, పోలీస్ శాఖ త్వరితగతిన చర్యలు తీసుకుందని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.  ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారని తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో మర్డర్ చేస్తే.. గంజాయి మత్తులో చేశాడని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని హోంమంత్రి వనిత మండిపడ్డారు.  వైఎస్ఆర్సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు..వాళ్ల హయాంలో మహిళల భద్రత కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో పంచాయితీలు పెట్టి నిందితులకు కొమ్ము కాయడం తప్ప బాధితులకు అండగా నిలబడలేదన్నారు.  రిషితేశ్వరి ఆత్మహత్య  చేసుకుంటే సకాలంలో చర్యలు తీసుకోలేదని.. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే చంద్రబాబు సెటిల్మెంట్‌ చేశాడని తెలిపారు. 


చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదు? 


జగన్‌ ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదం మోపిందన్న హోంమంత్రి.. ఎప్పుడూ లేనివిధంగా 2 లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. ఏజెన్సీలో గంజాయి సాగును ధ్వంసం చేసి, గంజాయి పండించేవారికి ప్రత్యామ్నాయ పంటలు పండించేలా పోలీసులు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఆపరేషన్‌ పరివర్తన్‌ కార్యక్రమంతో మార్పు తీసుకువచ్చామని హోంమంత్రి చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోలీస్‌ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంటే.. కావాలనే ప్రభుత్వం మీద నిందలు వేయడానికి,  ఏదో ఒక రాతలు రాయడం, మాటలు మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు. రాజమండ్రిలో పుష్కరాల షూటింగ్‌కు వెళ్లి 29 మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని హోంమంత్రి వనిత ప్రశ్నించారు. ఇటీవల కందుకూరు, గుంటూరులో 11 మందిని పొట్టనబెట్టుకున్న చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. క్రైమ్‌రేట్‌ తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రతిపక్షం తెలుసుకోవాలన్నారు.  ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఏదిపడితే అది మాట్లాడటం మంచిది కాదని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు.


అసలేం జరిగింది? 


గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ బాలిక దారుణ హత్యకు గురి కావడం కలకలం రేగింది. ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో బాలికను ఓ దుండగుడు హత్య చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన బాలిక అంధురాలు. స్థానికంగా నివసించే ఓ యువకుడు ఓ కత్తితో బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజు అని గుర్తించారు. మద్యం మత్తులో అతడు ఈ దాడి చేశాడని పోలీసులు నిర్థారించారు.  ఆదివారం(ఫిబ్రవరి 12) రాజు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి చెప్పింది. బాలిక ఈ విషయాన్ని తనకు చెప్పినట్లుగా ఆమె తెలిపింది. దీంతో తాము అతడిని మందలించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. దుండగుడు డీఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనించదగ్గ విషయం.