Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఒక్కో అంశంపై విచారణకు ఆదేశిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు రోజా శాఖపై ఫోకస్ పెట్టింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా అవినీతి పాల్పడ్డారని మంత్రి రాంప్రసాద్‌ అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు వెల్లడించారు. 

అసెంబ్లీలో మంత్రి ఏమని ప్రకటించారు. 

మంత్రి రాంప్రసాద్‌ సభలో ఏమన్నారంటే" గత ప్రభుత్వం ఎంతోమంది క్రీడాకారుల భవిష్యత్‌తో ఆడుకున్నారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో 47 రోజుల్లోనే 120 కోట్లు ఖర్చు పెట్టారు. గత ఐదో తేదీన ఇదే ప్రశ్నలపై సభలో చర్చించాం. 45 రోజుల్లో నివేదిక ఇచ్చేలా విజిలెన్స్ కమిటీ, సీఐడీ విచారణకు ఆదేశించాం. నివేదిక వచ్చిన తర్వాత ఇందులో అవినీతికి ఎవరెవరు పాల్పడ్డారు అది ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు అందరి పేర్లను సభలో ప్రకటిస్తాం." అని మంత్రి ప్రకటించారు.  

దీనిపై స్పందించిన స్పీకర్‌" సభ్యులు అడిగారనే మాత్రమే కాదు. ఇందులో చాలా అవినీతి జరిగిందని రాష్ట్రంలోని అందరికీ తెలుసు. ఇంకా పూర్తి వివరాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్‌గా ఎంక్వయిరీ చేయించండి. ఎంత అవినీతి జరిగింది. ఎంత తిన్నారనేది పబ్లిక్‌కు తెలియాలి. సీరియస్‌గా తీసుకోండి" అని మంత్రికి సూచించారు. 

ఏంటీ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం

గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకని చెప్పి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ ఇలా ఐదు రకాల క్రీడల్లో ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు 47 రోజులుగా పోటీలు జరిపారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 25 లక్షల 40 వేల మంది క్రీడాకారులు  పాల్గొన్నారు. తమ ప్రతిభను చాటుకున్నారు. 3లక్షల 30 వేల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిపారు. లక్షా 24 వేల పోటీలు మండల స్థాయిలో జరిగాయి. 7వేల 346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగాయి. 1731 పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో 260 పోటీలు జరిపారు. విశాఖలో జరిగిన ఫైనల్స్‌ పోటీలను అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ప్రత్యక్షంగా తిలకించారు. క్రీడాకారులకు దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. వాటితోపాటు రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు ఇచ్చారు. 

ప్రతిభ చూపిన ఆటగాళ్లను దత్తత కూడా తీసుకున్న సంస్థలు 

ఆడుదాం ఆంధ్రలో అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకున్న పలువురు క్రీడాకారులను దత్తత తీసుకుంటామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. వాళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌, ప్రొ కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌, వాలీబాల్‌, ఏపీ ఖోఖో అసోసియేషన్‌, ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 14 మంది క్రీడాకారులకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు వెల్లడించింది. క్రికెట్‌ నుంచి పవన్‌(విజయనగరం), చెల్లెమ్మ, కేవీఎం విష్ణువరోధని(ఎన్‌టీఆర్‌ జిల్లా)ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ దత్తత తీసుకుంది. క్రికెట్‌లో శివ(అనపర్తి), చెల్లమ్మ గాయత్రి(కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) ముందుకొచ్చింది.