ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ లోటు భర్తీకి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు విద్యుత్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే చాలా వరకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. అందుకే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయాలని ఏపీ జెన్క్ అధికారులను ఆదేశించారు. . సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యుత్ సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉందని గుర్తు చేశారు పెద్దిరెడ్డి. పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయని తెలిపారు. ఏపీలో విద్యుత్ లోటు ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదని కోతలు చాలా తక్కువగా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 


కృష్ణపట్నం, ఎన్ టిటిపిఎస్ థర్మల్ స్టేషన్లలో నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌లను సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు పెద్దిరెడ్డి. ఈ రెండు ప్లాంట్లు వినియోగంలోకి వస్తే 1600 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుందన్నారు. ఎన్టిటిపిఎస్‌లో స్టేజ్-5 ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దీంతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందన్నారు. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ రెండు ప్లాంట్ల విషయంలో ఇబ్బందులు ఉంటే పరిష్కరించి ప్రథమ ప్రాధాన్యతగా నిర్మాణం లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. 


పోలవరం, సీలేరు జల విద్యుత్ ప్రాజెక్ట్‌లలో జరుగుతున్న పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు పెద్దిరెడ్డి. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా అదనంగా రాష్ట్రానికి జల విద్యుత్ రూపంలో 1190 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. థర్మల్ విద్యుత్ కన్నా జల విద్యుత్ ఉత్పత్తికి వ్యయం కూడా తక్కువ అవుతుంది. ఈ మేరకు ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ, జలవనరుల అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని... కేంద్రాన్ని సంప్రదించి అనుమతులను తీసుకువస్తామన్నారు. 


రాష్ట్రంలో ఎన్టీటిపిఎస్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు మొత్తం 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాయలసీమ టిపిపి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు మొత్తం 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఎస్డిఎస్టిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్ట్ ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా మొత్తం 5010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జల విద్యుత్ ప్లాంట్ల ద్వారా మొత్తం 1774 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో రెండు సోలార్ ప్రాజెక్ట్‌ల ద్వారా 405 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 


పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 2024-25 నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. లోయర్ సీలేరు నుంచి 230 మెగావాట్ల జల విద్యుత్ 2024-25 నాటికి ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కృష్ణపట్నం స్టేజ్ -2 నిర్మాణానికి ఇప్పటి వరకు మొత్తం 7705.14 కోట్లు ఖర్చుచేశారు. ఈ ప్లాంట్‌కు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 3.548 మిలియన్ టన్నుల కోల్ లింకేజీకి అనుమతులు లభించాయి. 2021 నవంబర్‌లోనే యూనిట్ సింక్రనైజేషన్ ప్రారంభించారు. గతనెలలో ట్రయల్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఎన్టీటిపిఎస్ 5వ స్టేజ్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.6308.62 కోట్లు వ్యయం చేశారు. అతి త్వరలోనే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు..