Amaravati Land Latest News | అమరావతి: ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం, మరియు రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ముందుకు వచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు పాల్గొన్నారు.

Continues below advertisement

మౌలిక వసతుల కల్పన, రోడ్ల అనుసంధానం
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రెండేళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా, సీడ్ యాక్సిస్ రహదారిని త్వరలోనే మంగళగిరి రహదారికి అనుసంధానించి అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, భవిష్యత్తులో అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూ సమీకరణ కూడా చేపడతామని తెలిపారు. లభించే ప్లాట్లకు సంబంధించి లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు ఇచ్చిన వారి సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.
 
ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం
అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో పనులు వేగంగా సాగుతున్నాయని, అయితే రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఉన్న 11, 8 జోన్లలో మాత్రమే పనులు మినహాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 66 వేల ఫ్లాట్లలో ఇప్పటికీ 7 వేల ఫ్లాట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లు రోజుకు 30 నుంచి 60 మంది చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
 
450 మంది రైతులకు ఇవ్వాల్సిన 1,891 ఫ్లాట్స్ కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్న కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. విదేశాల్లో ఉన్నవారు, ఇతరత్రా సమస్యలు ఉన్న వారు సైతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా, రోజుకు వెయ్యి రిజిస్ట్రేషన్లు చేసేలా అధికారులను అందుబాటులో ఉంచామని మంత్రి నారాయణ తెలిపారు. రైతులు ముందుకు వచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Continues below advertisement