అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచడమే కాకుండా, రాజధాని గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ రాజధాని గ్రామమైన వడ్డమానులో సోమవారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి నారాయణకి ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతుల విన్నపాన్ని మన్నించి, కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. సుమారు రూ.98.7 లక్షల రూపాయల వ్యయంతో 1,148 మీటర్ల పొడవున్న ఈ రహదారిని యుద్ధప్రాతిపదికన నిర్మించినట్లు వెల్లడించారు.

Continues below advertisement

టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా చేసేందుకు కృషిఅమరావతిని ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిలిపేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వాములైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో వచ్చే ఏడాది జనవరి నుంచి మౌలిక వసతుల కల్పన పనులను భారీ ఎత్తున చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో ఆధునిక రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వరద  కాలువలు, వీధి లైట్ల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Continues below advertisement

మౌలిక సదుపాయాల కోసం మరింత భూమి సేకరణ

రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, రైల్వే ట్రాక్ వంటి మౌలిక సదుపాయాల కోసం భూములను సేకరించాల్సి ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ భూముల సేకరణకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ (Land Pooling) పద్ధతికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేలా ప్రోత్సహిస్తామని, ఒకవేళ ఎవరైనా ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రాకపోతే మాత్రమే ప్రత్యామ్నాయంగా భూసేకరణ (Land Acquisition) చట్టంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వివరించారు. గ్రామస్తుల కోరిక మేరకు త్వరితగతిన రోడ్డు నిర్మించినట్లే, రాజధాని అభివృద్ధిని కూడా అంతే వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.