Nara Lokesh: పెరుగుతున్న సాంకేతికతను యూజ్ చేస్కొని సరైన మార్గంలో డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ దీన్ని తప్పుడు మార్గాల్లో వాడుతున్న వాళ్లు అంతకంటే భారీ సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్లు పాలిటిక్స్‌లో కూడా ఉన్నారు. ఒక పార్టీకి అభిమానులుగా చెప్పుకొని ప్రత్యర్థులపై ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలపై ఇప్పటికే ప్రభుత్వాలు కేసులు పెడుతున్నాయి. ఇలాంటి వీడియోలే సొంత పార్టీ వాళ్లు చేస్తుంటే తప్పు అని ఖండించడం చాలా అరుదు. అలాంటి పని మంత్రి నారా లోకేష్ చేశారు. జగన్ ప్రతిపక్ష హోదాపై టీడీపీ అభిమానులు ఒక కల్పిత వీడియో చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని గమనించిన నారా లోకేష్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. గౌరవంగా, హుందాగా ఉండాలని క్లాస్ తీసుకున్నారు. 

Continues below advertisement

వైసీపీ అధినేత  జగన్ మోహన్ రెడ్డి చాలా కాలంగా ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు. కోర్టుల్లో కేసులు కూడా వేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదు. దీనిపై రాజకీయంగా చాలా ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు వేస్తున్నాయి. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఎలా ఇస్తామంటూ ప్రభుత్వ పెద్దలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అంతా చెబుతున్నారు. 

ప్రతిపక్షహోదా కోసం జగన్ అభ్యర్థిస్తున్నారని అర్థం వచ్చేలా టీడీపీ అభిమానులు ఏఐ సహాయంతో వీడియోను క్రియేట్ చేశారు. రోడ్డుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వెళ్తున్న టైంలో అక్కడే రోడ్డు పక్కనే జగన్ ధర్నా చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఆ ముగ్గురు వచ్చిన తర్వాత లేచి ప్రతిపక్ష ఇవ్వాలని కోరినట్టు అందులో క్రియేట్ చేశారు. ఇది విపరీతంగా వైరల్ అయ్యింది. 

Continues below advertisement

వైరల్ అయిన వీడియోను గమనించిన నారా లోకేష్‌ పార్టీ శ్రేణులు, అభిమానులను వారించారు. ఇలాంటి వ్యక్తిగత దాడులు వద్దని సూచించారు. వాళ్లంతా కేవలం రాజకీయ ప్రత్యర్థులేనని, వారి గౌరవానికి భంగం కలిగించవద్దని హితవు పలికారు. " నా ప్రియమైన టీడీపీ కుటుంబానికి - అలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగం అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కాదు. మనమంతా రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, కానీ మన బహిరంగ అభిప్రాయం వెల్లడి గౌరవంగా ఉండాలి. దానిపైనే ఆధారపడి ఉండాలి. ఇలాంటి కంటెంట్‌కు దూరంగా ఉండాలని మద్దతుదారులతో సహా ప్రతి ఒక్కరినీ నేను అభ్యర్థిస్తున్నాను. విమర్శించంలో కూడా మర్యాదను కాపాడుకుందాం. ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెడదాం." అని తన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.