జగన్ ను మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరు
-  కనుమరుగైపోయిన నేతలే దీనికి సాక్ష్యం
-  తప్పు చేసిన శ్రీదేవి దళిత మహిళ అంటే సరిపోదు
-  ఆమె గురించి ఆలోచించే సమయం కూడా సజ్జలకు ఉండదు
-  మంత్రి మేరుగు నాగార్జున
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అభిప్రాయపడ్డారు. గతంలో జగన్ కు వెన్నుపోటు పొడిచి ప్రస్తుతం రాజకీయాల్లో కనుమరుగైపోయిన నేతలే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి నాగార్జున మాట్లాడారు. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మహిళల్ని వివస్త్రలుగా చేసిన అమానుషకృత్యాలు అనేకం జరిగినా కేసులు కూడా పెట్టేవారు కాదని చెప్పారు. అనేక సంఘటనల్లో దళితులు కేసులు పెట్టాలని పోలీస్టేషన్ల ఎదుట ధర్నాలు కూడా చేసిన సంఘటనలు కూడా జరిగాయన్నారు. 


అప్పట్లో దళితులపై దాడులు జరిగితే కనీసం కేసులు కూడా పెట్టని టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వపాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని మాట్లాడుతున్నారని విమర్శించారు. దళితుల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించడం, రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, డీబీటీ ద్వారా దళితులకు నేరుగా వేల కోట్ల రుపాయలు అందించడం మీకు అత్యాచారాలుగా కన్పిస్తున్నాయా? అని టీడీపీ నేతలను నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దళితులపై దాడులు జరిగాయో, కనీసం కేసులు కూడా పెట్టకుండా వారికి అన్యాయం ఎలా జరిగిందో, దళితులపై దాడులు జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో, ఈ విషయంలో తమ వైసీపీ ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తోందో బహిరంగంగా చర్చించడానికి మీరు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. 


చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎస్సీల సంక్షేమం కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తే, మూడేళ్ల తమ ప్రభుత్వ పాలనలో గత ఫిబ్రవరి మాసాంతానికే రూ.51 వేల కోట్లు ఖర్చు చేయడం దళితుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగానే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చమట చుక్కలతో గెలిచిన శ్రీదేవి ఇప్పుడు తమ పార్టీ మీద బురద చల్లడం సమంజసంకాదన్నారు. శ్రీదేవి తప్పు చేసింది కాబట్టే భయపడి హైదరాబాద్ లో దాక్కుందని అభిప్రాయపడ్డారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి దళిత మహిళ అని చెప్పుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఆమె గురించి ఆలోచించేంత సమయం కూడా సజ్జలకు ఉండదని చెప్పారు. శ్రీదేవి ఆస్తులు, ఆమె పార్టీ ఆఫీసు జోలికివెళ్లాల్సిన అవసరం తమకు ఏముందన్నారు. 


శ్రీదేవి తానే దాడులు చేయించుకొని ఉండవచ్చునని అన్నారు. శ్రీదేవి ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియడం లేదని, ఆమె అలా మాట్లాడుతుందా, లేకపోతే ఆమెతో అలా మాట్లాడిస్తున్నారా, లేకపోతే ఆమెకు మతి భ్రమించిందా? అని నాగార్జున వ్యాఖ్యానించారు. గతంలో కూడా అనేక మంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి, వెన్నుపోటు పొడిచారని గుర్తు చేసారు. అయితే జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన వారెవరూ రాజకీయాల్లో మనలేరని, గతంలో ఆయనను మోసం చేసి ప్రస్తుతం రాజకీయాల్లో కనుమరుగైపోయిన నాయకులే దీనికి తార్కాణమని అభిప్రాయపడ్డారు.